ప్రతిభాశాస్త్రి శతజయంతి నేడు

- June 08, 2019 , by Maagulf
ప్రతిభాశాస్త్రి శతజయంతి నేడు

తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్‌.శాస్త్రికి ఇది శతజయంతి సంవత్సరం. జూన్‌ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించారాయన. 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్‌.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని బొంబాయి వెళ్లిన శాస్త్రి ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో, అక్కడే ఉండిపోయి నాటి హిందీ నటుడు మజర్‌ఖాన్‌ సినిమా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా చేరారు. అనంతరం కె.యస్‌.ప్రకాశరావు కోరిక మేరకు 'ద్రోహి' చిత్రనిర్మాణ వ్యవహారాలు చూడటానికి మద్రాసు వచ్చారు. ఆతర్వాత ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో చేరారు. దాంతో 'ప్రతిభా'శాస్త్రిగా పాపులర్‌ అయ్యారు. అక్కడే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు సన్నిహిత మిత్రులయ్యారు. 1959లో శాస్త్రి, వాసిరెడ్డి నారాయణరావుతో కలసి 'జయభేరి' చిత్రం నిర్మించారు. ఆతర్వాత వీనస్‌ వారి 'సుమంగళి', 'పవిత్రబంధం', 'లక్ష్మీనివాసం', 'మంచివాడు', 'అండమాన్‌ అమ్మాయి', సారథీ వారి 'ఆత్మీయులు', విజయా వారి 'శ్రీరాజరాజేశ్వరి కాఫీ క్లబ్‌', దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఎందరో నటులు, సాంకేతికనిపుణుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు ప్రతిభా శాస్త్రి. 

2007 ఆగష్టులో, అక్కినేని చెన్నై వచ్చి అస్వస్థతకు గురైన మిత్రుడు శాస్త్రికి 'అక్కినేని పురస్కారాన్ని' అందజేశారు. ఆ ఏడాది డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి స్వర్గస్ధులయ్యారు. కొంగర జగ్గయ్య ఆయనకు 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ తెలుగు సినిమా' అని కితాబిస్తే, పి.బి. శ్రీనివాస్‌ 'అద్వితీయ ప్రతిభాశాస్త్రి' అని కీర్తించారు. ఆయన శతజయంతి నేడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com