డిగ్రీ చదివితే చాలు సాఫ్ట్‌వేర్ జాబ్.. నిరుద్యోగులను నిండా ముంచిన కంపెనీ

- August 07, 2019 , by Maagulf
డిగ్రీ చదివితే చాలు సాఫ్ట్‌వేర్ జాబ్.. నిరుద్యోగులను నిండా ముంచిన కంపెనీ

విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచిందో ఓ బోగస్ కంపెనీ. డిగ్రీ చదివితే చాలు, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామంటూ చాలా మంది దగ్గర 9 నుంచి 15 వేల రూపాయల వసూలు చేశారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.

విశాఖలో 6 నెలల కిందట షణ్ముఖరావు రైన్‌ బో టెక్నాలజీస్ పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు. తొలుత ఇద్దరు హెచ్ఆర్ మేనేజర్లను రిక్రూట్‌ చేశాడు. ఆ తర్వాత నిరుద్యోగులను ఆకర్షించేందుకు సాఫ్ట్‌వేర్‌ జాబ్స్ అంటూ పెద్ద ఎత్తున పత్రికల్లో యాడ్స్ ఇచ్చాడు. వీటికి ఆకర్షితులై వచ్చిన వారికి హెచ్ఆర్ మేనేజర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సాలరీని బట్టి ట్రైనింగ్‌ ఇవ్వాలని చెప్పారు. యజమాని షణ్ముఖ రావు చెప్పినట్టు శిక్షణ కోసం హెచ్ఆర్ మేనేజర్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 9 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేశారు. సుమారు వంద మందికి పైగా నిరుద్యోగులకు తూతూ మంత్రంగా ట్రైనింగ్ ఇచ్చి, వెబ్‌ డిజైనర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్‌ ఎగ్జిక్యూటివ్‌ అనే పేర్లతో ఆఫర్ లెటర్లు ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాల కోసం కబురు రాకపోవడంతో నిరుద్యోగులు హెచ్‌ఆర్ మేనేజర్లను నిలదీశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హెచ్ ఆర్ మేనేజర్లు సైతం తాము కూడా మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షణ్ముఖరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే రైన్ బో టెక్నాలజీస్ అసలు ఓనర్ తాను కాదని ఆయన చెప్పాడు. వేరే యజమాని ఉన్నాడని తెలిపాడు. దీంతో నిరుద్యోగులను మోసం చేసిన అసలు సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com