నెహ్రూ సేనలను వెనక్కు పిలవడం వల్లే ఇలా..

- August 07, 2019 , by Maagulf
నెహ్రూ సేనలను వెనక్కు పిలవడం వల్లే ఇలా..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 25 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీవోకేను ఎలా రాబట్టుకోవాలో తమకు తెలుసన్నారు. కశ్మీర్ విభజనపై లోక్‌సభలో ఇతర సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అమిత్ షా. 370 ఆర్టికల్ వల్లే కశ్మీర్‌ ను భారత్‌లో అంతర్భాగంగా చూడలేకపోయారన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. 70 ఏళ్ల సమస్యకు తెరపడిందన్నారు.

పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. కశ్మీర్ శాశ్వతంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండిపోదన్నారు. నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్ నుంచి చేజారిందన్నారు. మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని. మోడీ ప్రభుత్వం ఎవరికీ తలొగ్గబోదన్నారు. 1948 భారత సేనలు పాక్ ఆర్మీని తరుముతూ బాలకోట్ వరకు వెళ్లాయని అమిత్ షా చెప్పారు. ఆ సమయంలోనే భారత సేనలను నెహ్రు వెనక్కు పిలిపించారని.. దాని వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందన్నారు.

ఎవరినీ సంప్రదించకుండానే ఆకాశవాణి రేడియో ద్వారా ఆర్టికల్ 35 ఏ ను నెహ్రూ నాడు ప్రకటించారని అమిత్ షా ఆరోపించారు. ప్రస్తుతం కశ్మీర్ నుంచి బలగాలను వెనక్కు పిలిపించే ఆలోచన లేదన్నారు. హురియత్ నేతలతో ఎలాంటి చర్చలు కూడా ఉండవన్నారు. తాము ప్రజాస్వామ్యం ప్రకారమే ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఏపీని ఏ రీతిన కాంగ్రెస్ విభజించిందో గుర్తు చేసుకోవాలన్నారు. విభజన బిల్లును ఏపీ అసెంబ్లీ తిరస్కరించినా సరే దాన్ని పార్లమెంట్ ముందుకు తెచ్చింది కాంగ్రెస్ అన్నారు.

ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 371డీ తో పోల్చవద్దన్నారు. ఈ విషయంలో ఏపీ, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అమిత్ షా ప్రసంగానికి ముందు ప్రధాని మోడీ లోక్‌సభలోకి వస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు లేచి నిలబడి వందేమాతరం ఆలపిస్తూ స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com