ప్రేమికుల దినోత్సవం ప్రత్యేక కధనం

- February 13, 2016 , by Maagulf
ప్రేమికుల దినోత్సవం ప్రత్యేక కధనం

ప్రేమికుల దినోత్సవం ప్రత్యేక కధనం ....     
  
  నిన్నెవరూ ప్రేమించకుండా ఉన్నట్టయితే... అది తప్పకుండా నీ తప్పే ?

‘నీకు ఆకలి వేయడం లేదా.. దప్పిక కూడా లేదా.. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ వుంటున్నావా..సమయం మొత్తం వారి మాటలు వినాలని.. వారితో గడపాలని వుంటుందా... అయితే ఇది ప్రేమే ' అంటూ సినిమాల్లో హీరో.. హీరోయిన్లను స్నేహితులు ఆటపట్టిస్తుంటారు.. నిజంగా ప్రేమిస్తే అలాగే వుంటుందా..? ప్రేమంటే అంతేనా..? కేవలం ఇలాంటి భావాలతో జీవితాంతం మనతో నిలిచి వుండే ప్రేమను గుర్తించగలమా..? అసలు ఏంటి ఈ ప్రేమ..!? దీని కోసం ప్రత్యేకంగా ఎందుకీ వేడుకలు..రోజులు..?

మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి సందర్భంలోనూ ఇది ఏదో ఓ రకంగా ‘నేనున్నాను’ అంటూ పలకరిస్తూనే వుంటుంది. అంతలోనే దోబూచులాడుతూ ఆడుకుంటుంది. కొందరి జీవితాలను చిందర వందర చేస్తుంది. మరికొందరిని పూల పల్లకీ ఎక్కిస్తుంది.అమాంతం అగాంధంలోకి తోసేస్తుంది. అసలు ఈ మాట వింటేనే ఎందుకు మనసుల్లో అంత ఉద్విగ్నత కలుగుతుంది. దీని కోసం ఎందుకు ఇంతలా మనం పరితపిస్తున్నాం.. ప్రత్యేకంగా దీని కోసం ఓ రోజును ఏర్పాటు చేసుకుని వేడుకలు చేసుకుంటున్నాం..? అసలు ఏమిటీ చరిత్ర..? ఎక్కడిదీ సంస్కృతీ...?

వాలెంటైన్స్‌ డే చరిత్ర... 
వాలెంటైన్స్‌ డే...కోసం ప్రపంచమంతా ప్రేమికులు ఎదురుచూస్తారు. ప్రేమికుల పండుగగా పేరుగాంచిన ఈ రోజున యువతీయువకులు కలిసి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు వాలెంటైన్స్‌ డేను ఎందుకు జరుపుకుంటారు అన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఈ రోజును వివిధ దేశాలలో తమదైన శైలిలో జరుపుకుంటారు. ప్రాచీన రోమన్‌లు పూజించే దేవతలలో ‘జూనో’ ఒకరు. ఆ దేవత ‘స్ర్తీలకు, పెళ్ళిళ్ళకూ సంబంధించిన దేవత’ అని వారి నమ్మకం. ఆ జూనో దేవతపై ఉన్న భక్తిశ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకొని ఉత్సవాలు చేసుకునేవారు. 

ఆ దేశపు కొన్ని పక్షులు ఆ తేదీన ప్రేమాతిశయంతో జతలు కట్టేవని ప్రాచీన రోమన్‌ చరిత్రకారులు రాసుకున్నారు. ఇక ఫిబ్రవరి 15వ తేదీన రోమ్‌ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఇన్ని విధాలుగా ఫిబ్రవరి 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది.అనంతర కాలంలో ఈ రోజును తెలుసుకున్న అమెరికన్‌ పౌ రులు తమ పరస్పర ప్రేమల్ని తెలియపరుచుకోవడానికి ఆ రోజున ప్రేమకార్డులను పంచి పెట్టుకోవడం మొదలెట్టారు. అప్పటి నుంచి వాలెంటైన్స్‌ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రేమికుల రోజుగా పేరు గాంచింది. 

ఆధునిక కాలంలో... 
1797లో బ్రిటన్‌లో వాలెంటైన్స్‌ డే సందర్భంగా గ్రీటింగ్‌కార్డులను మొదటిసారిగా ముద్రించారు. అనంతరం 19వ శతాబ్దంలో వాలెంటైన్స్‌ డే కార్డులకు క్రమక్రమంగా డిమాండ్‌ పెరగడం ప్రారంభమైంది. ఫ్యాన్సీ వాలెంటైన్‌లను లేసులు, రిబ్బనులతో అందంగా తయారుచేయడం ప్రారంభించారు.అమెరికా, యూరప్‌ దేశాలలో నేడు వాలెంటైన్‌ కార్డులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా లక్షలాది కార్డులు ఈ సందర్భంగా విక్రయిస్తారు. ఆసియాలో... ఆసియా ఖండంలో వాలెంటైన్స్‌ డే వేడుకలను ముందుగా సింగపూర్‌, చైనా, దక్షిణ కొరియా దేశాలలో నిర్వహించేవారు.దక్షిణ కొరియాలో యువతులు ప్రేమికుల దినోత్సవం రోజున తమకు నచ్చిన యువ కులకు చాక్లెట్‌లను బహుమతిగా ఇచ్చేవారు. చైనా సంస్కృతిలో భాగంగా వాలెంటైన్స్‌ డేను ‘ద నైట్‌ ఆఫ్‌ సెవెన్‌’గా జరుపుకునేవారు. ఇక జపాన్‌లో ప్రేమికుల దినోత్సవాన్ని తనబతా పేరిట కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. 

మధ్య ప్రాచ్య దేశాలలో.. 
ఈజిప్ట్‌లో సైతం ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్‌ డేను జరుపు కుంటున్నారు.దీన్ని ఈద్‌ ఎల్‌ హాబ ఎల్‌ మస్రీ పేరిట నవంబర్‌ 4వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ రోజున అక్కడ ప్రేమికులు ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలను బహుమతులుగా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇజ్రాయిల్‌లో జ్యూయిష్‌ వాలెంటైన్స్‌ డేను ‘తు బిఎవి’ పేరుతో జరుపు కుంటున్నారు. ఇక సౌదీ అరేబియా దేశంలో 2002 నుంచి 2008 మధ్యకాలంలో పోలీసులు వాలెంటైన్స్‌ డే ఐటమ్స్‌ విక్రయాలను బ్యాన్‌ చేశారు. ఇరాన్‌లో సైతం ఇటీవల వాలెంటైన్స్‌ డేను జరుపుకోవద్దని నిషే ధం విధించారు. వాలెంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డులు, బహుమతులు, టెడ్డీ బేర్లను విక్రయించకూడదని ప్రభుత్వం స్పష్టంచేసింది. 

ఈ నేపథ్యంలో ప్రేమంటే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, ఆ రోజున సన్నిహితంగా గడపడమే అనే భావనకు ఆధునిక యువత వచ్చినట్టు కనుపిస్తున్నది. ఆ రోజున ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకొని తమదెంత ‘విలువైన’ ప్రేమో యువత చాటుకుంటున్నప్పటికీ అది వారి జీవితకాలం నిలుస్తున్న దాఖలాలు కనుపించడం లేదు.ప్రేమంటే.. ఆకర్షణ మాత్రమే కాదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం. ఇంతకీ ప్రేమం టే ఏమిటి? 

ప్రేమంటే... 
ఈ భూమి మీద ఎవరైనా సరే.. ఎంతటి గొప్పవారైనా సరే.. కోరుకున్నప్పుడు ప్రేమను పొందడం...ప్రేమించేలా చేసుకోవడం సాధ్యం కాదు. దాన్ని కొనలేరు.. అమ్మలేరు.. అది రావాలనుకున్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే వచ్చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎవరిని వారు ప్రేమిం చుకోవడం తెలుసుకోవాలి. ప్రేమంటే బంధించడం కాదు. ప్రేమంటే స్వేచ్ఛను ఇవ్వడం. అవతల వ్యక్తిని వారిని వారుగా ఆమోదించడం. అప్పుడే అందులోని మాధుర్యం అర్థమవుతుంది. ప్రేమను అర్థం చేసు కోవడం మొదలెడితే జీవితం మొత్తం కొత్త అనుభూతులను పంచుతూ తోడుగా వస్తుంది. 

ప్రేమ ఓ వ్యసనం...
జీవితం మొత్తం సంతోషం కోసం వెతుకులాట కొనసాగుతూనే వుంటుంది. అది ఓ చోట ఆగిపోవడం అంటూ వుండదు. కానీ అది మన చుట్టూనే వుంటుంది. దాన్ని పొందడం, అందుకోవడంలోనే వుంటుంది అంతా.మన ప్రాణ వాయువు ఆక్సిజన్‌ మనచుట్టూ ఆవరించి వుండి మనల్ని ఎలా కాపాడుతుందో అది కూడా అంతే. నిత్యం మనల్ని కాపాడుతూ అంటిపెట్టుకుని వుంటుంది. దాన్ని గ్రహించే సమయమే వుండదు. ఎక్కడో వున్నదాని కోసం వెంట పడుతూ.. పక్కనే వున్న దాన్ని నిర్లక్ష్యం చేస్తాం..గ్రహించేలోపే అది దూరమయిపోయిందని పొర్లిగింతలు పెడతాం. ఆత్మహత్యలు చేసుకుంటాం.. అవసరమయితే చం పేస్తాం.. చావకపోతే మళ్లీ మళ్లీ విసిగిస్తాం. మరో రూపంలో మనకు దొరుకుతున్న ప్రేమ కనిపించదా..? కనిపించదు.. ఎందుకంటే ఇంత వరకు మనకు తెలిసిన ప్రేమ అది నేర్పించలేదు. మన ప్రేమకు అసలు ఆ విషయమే తెలియదు.

ఇదంతా కూడా ప్రేమే..! 
వెతకకపోయినా పర్వాలేదు. మన చుట్టురా తిరుగుతూనే వుంటుంది. ఏదో విధంగా దగ్గరయ్యేందుకు తన తంటాలు తాను పడుతూ వుంటుంది. అమ్మ చేతి గోరు ముద్దలా దగ్గరికి వచ్చినప్పుడు వద్దంటూ వెనక్కి వెళ్లిపోతూ ఏడిపిస్తూ.. మారాం చేస్తాం. నాన్న చేతి బహుమతిలో మనం కోరినది లేదంటూ ఆ ప్రేమను తక్కువ చేస్తాం. అందులో లోపాలు వెతుకుతాం. బడిలో మాస్టారు భవిష్యత్తు బాగు కోసం అందించే ప్రేమ ను అజ్ఞానంతో అర్థం చేసుకోకుండా వదిలేస్తాం. పాఠాలకు పరిమితమై దానిలోని ఆంతర్లీనపు ప్రేమను విడిచేస్తాం. మార్కుల వేటలో అక్కడికి మర్చిపోతాం. స్నేహితుని మాటల్లోని ప్రేమను అందుకునే లోపే దూరం అవుతాం. అందులోని తీపి జ్ఞాపకాలను మనసు మూలాల్లోకి నెట్టేస్తాం. దగ్గరగా వున్న దాన్ని గ్రహించలేక ఆకాశం వైపు చూస్తూ గాలిలో చేతుల్తో రాస్తూ అదే లోకంలో బతికేందుకు ఇష్టపడతాం. 

మనకు తెలిసిన ప్రేమ... 
అసలు వయసు మనకు తెలిసిన ప్రేమ. కరెక్టుగా పుట్టేది వయసు వచ్చినపుడే. ఓ అమ్మాయిని.. లేదా అబ్బాయిని చూసిన వెంటనే పుడుతుంది. వారికిచ్చే బహుమతుల్లో పెరుగుతుంది. తిరిగే తిరుగుళ్ళలో ఆటలాడుకుంటుంది. కన్నవారిని బాధ పెడుతూ పరుగులు తీస్తుంది. దూరంగా పోయి దాక్కుంటుంది.ఏడుస్తుంది... ఏడిపిస్తుంది... చేతకానితనంతో ఓడిపోతుంది. అంతగా ఆశపెట్టిన ప్రేమ దూరం అవుతుం ది. చిరాకులు.. పరాకులు కలిగించి చివరకు మాయం అవుతుంది. లేదా మరో రూపంలో దాడి చేస్తుంది. ఎంతగా అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మనం ఎదుటి వారిని ఓ కత్తితో పొడిచేంతలా.. యాసిడ్‌ పోసి కాల్చి మసిచేసేలా.. అడ్డు వస్తే అవతలి వారి అమ్మా నాన్నల్ని అడ్డంగా నరికేంతలా.. ఆహా మన ప్రేమ ఎంత ఎర్రగా వుందో..!

అచ్చం మనలా.. 
మన మనసుకు నచ్చినట్లే అన్నీ వుండాలి. మన ప్రేమ కూడా అలాగే వుండాలి. దాని సహజత్వాన్ని కోల్పో యి అచ్చం మనలా కనిపించాలి. మనం నవ్వితే నవ్వాలి.. ఏడ్చితే ఏడ్వాలి. వెళ్ళిపొమ్మంటే వెళ్ళి పోవాలి. చచ్చిపోమంటే చచ్చిపోవాలి. ఇందులో ఆ ప్రేమ ఎంతగా నలిగి ోయినా పర్వాలేదు. మన మనసు మెచ్చి నట్లు వుంటే చాలు. అదే ప్రేమ.. అంతే ప్రేమ.. చివరికి తన రూపు కోల్పోయి.. ఆ పరిమళాన్ని వదిలి.. ఆహ్లాదాన్ని విడిచి జీవచ్ఛవంలా సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం మనం నిత్యం చూస్తున్న ప్రేమలు ఇవే. మనం కోరుకుంటున్న ప్రేమ ఇదే అయితే ఎప్పటికీ అసలైన ప్రేమలోని ఆనందాన్ని రుచిచూడలేం. ప్రేమకు కేవలం ఆనందమే కాదు. ఒక బాధ్యత కూడా. అవతల వ్యక్తి మనోభావాలను గౌరవిస్తూ జీవితాంతం సాగించాల్సిన పయనం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com