తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..

- April 29, 2024 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 25 పార్లమెంటరీ స్థానాలకు 503, 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 705 నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. ఆరు స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపసంహరించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోలేదు. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు సీఈవో. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ త‌ర్వాత ఇండిపెండెంట్ అభ్య‌ర్దుల‌కు ఆర్వోలు గుర్తులు కేటాయించ‌నున్నారు. ఇక, ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేష‌న్ వేసిన ప‌లువురు అభ్య‌ర్ధులు తమ నామినేషన్లను ఉప‌సంహ‌రించుకున్నారు.

తెలంగాణలోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత 1060 సెట్ల నామినేషన్లను ఈసీ ఆమోదించింది. అభ్యర్థులు భారీగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను ఈసీ ప్రకటించనుంది.

ఏపీలో ఏ విధంగా నామినేషన్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయో.. అదే స్థాయిలో నామినేషన్ల ఉపసంహరణ కూడా దాదాపుగా జరిగింది. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే.. అత్యధికంగా తిరుపతికి 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానమైన స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవడంలో వారు తగ్గలేదు.

కూటమికి సంబంధించి రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోకపోవడంతో ఈ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎవరికి బీఫామ్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో టీడీపీ, కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. బీఫామ్ అందని వారు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. కుటుంబసభ్యులుగా కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. వారు కూడా ఉపసంహరించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com