తెలుగు నాటక ప్రముఖుడు-పెద్ది రామారావు

- March 17, 2025 , by Maagulf
తెలుగు నాటక ప్రముఖుడు-పెద్ది రామారావు

ఆ అబ్బాయి వయస్సు గట్టిగా ఆరేళ్ళుండదు.లోహితాస్యుడి వేషం కట్టి, డైలాగులూ పద్యాలు కంఠంతా పట్టి, గడగడా వప్పిస్తున్నాడు. అవతల సుప్రసిద్ధ నాటక రంగతార గూడూరు సావిత్రి చంద్రమతి వేషం వేస్తున్నారు. ఇక హరిశ్చంద్రుడెవరు ? ఇంకెవరు మన డీవీ సుబ్బారావుగారే! జాషువా రాసిన శ్మశానం పద్యాలనాయన (ప్రేక్షకుల) గుండెలు కరిగే రీతిలో ఆలపిస్తుండగా, ఈ లోహితాస్యుడు గూడూరు సావిత్రి భుజం మీద గుర్రుకొట్టి నిద్రలాగేశాడు. మళ్ళీ మెళుకువ తెప్పించడానికి పాపం ఆ ప్రముఖ నటులిద్దరూ పడరాని పాట్లు పడ్డారు. అలా హేమాహేమీల సాంగత్యంలో ఆ కుర్రాడి నాటకరంగ జీవితం మొదలయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత అతగాడు ఒక నాటక రంగ ప్రతికకు సంపాదకుడు కావడంలో విడ్డూరమేమన్నా ఉందంటారా?

అతని పేరు పెద్ది రామారావు. ఆయన సంపాదకత్వంలో వెలువడుతున్న పత్రిక పేరు 'యవనిక'. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే కేంద్ర విశ్వవిద్యాలయంలో జూనియర్‌ రీసెర్చ్‌ఫెలోగా ఉంటూ పీహెచ్‌డీ కోసం పని చేస్తున్న రామారావు ఇతర రంగాల్లో సైతం 'కృషి' చేస్తున్నాడు. దూరదర్శన్‌లో చిరకాలంగా ప్రసారమవుతున్న మెగా డెయిలీ సీరియల్‌ ''రుతురాగాలు'' మాటల రచయితగా పెద్ది రామారావు పేరు తెలుగు ప్రేక్షకలోకానికి చిరపరిచితమైపోయింది. నేడు పెద్ది రామారావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం... 

పెద్ది రామారావు 1973, మార్చి 17న గుంటూరు జిల్లా లోని ఉన్నవ గ్రామంలో పెద్ది సాంబశివరావు, రామ రత్నమ్మ దంపతులకు జన్మించారు. నరసారావుపేట, గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో చదువుకున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి రంగస్థల కళలలో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ( ఎం.పి.ఏ) మరియు పి.హెచ్.డి పూర్తిచేశారు. తండ్రి పెద్ది సాంబశివరావు గారు బహుముఖ ప్రజ్ఞాశీలిత కలిగిన రచయిత మరియు రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాల్లో పుస్తకాలను డిజిటైజేషన్ చేసే ప్రాజెక్టుకు సారథ్యం వహించారు. 

నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో రామారావు ఎస్‌ఎఫ్‌ఐ అనే వామపక్ష విద్యార్ధి సంస్థలో పని చేశారు. ఆ సంస్థ సాంస్కృతిక విభాగమైన ఆంధ్ర ప్రజానాట్య మండలిలో చేరారు. స్వతగా నాటకరంగం మీద అభిరుచి ఉన్న రామారావు సహజంగానే ఆ సంస్థలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఒక దశలో ప్రజానాట్య మండలికి పూర్తి కాలపు కార్యకర్తగా 'సేవ' చేయాలని కూడా అనుకున్నాడట. అయితే ఎం.పి.ఏలో చేరే నాటికి రామారావు భావనా ప్రపంచం సరిహద్దులు విస్తృతమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల సాంస్కృతిక కదలికలు చాలా పరిమితమైనవనిపించాయి. ఏ పార్టీ సంస్థలోనూ లేకుండా ఉంటేనే మంచిదనే కనువిప్పు కలిగిందన్నారు. 

ఎం.పి.ఏ పూర్తి చేసిన తర్వాత కొద్దీ కాలం విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య స్థాపించిన "సుప్రభాతం" మాస పత్రికలో జర్నలిస్టుగా నాటి సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు రాసారు. ఆ కాలంలో భద్రాచలం అడవుల్లో నక్సలైట్ దళాన్ని కలసి వారి జీవన విధానంపై ఆసక్తికరమైన కథనం వ్రాసారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పి.హెచ్.డి రావడంతో పాటుగా 1998లో తెలుగు దూరదర్శన్‌లో  ప్రసారమైన ఋతురాగాలు ధారావాహికకు 2001 వరకు కథ, స్క్రీన్ ప్లే అవకాశం లభించింది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపు. 

ఋతురాగాలు సీరియల్‌కి పని చేసే అవకాశం రావడం నా జీవితంలో పెద్ద మలుపు. మనకు ఎన్ని మంచి ఆలోచనలూ, ఆదర్శాలూ ఉన్నా, వీటికి వాస్తవరూపం ఇవ్వగలిగే అవకాశం కూడా దొరకాలి. రుతురాగాలు టీమ్‌లో చేరడం ద్వారా నాకది లభించినట్లైందన్నారు. కావాలనే ఈ సీరియల్‌ కథాక్రమంలో ప్రగాఢమైన భావావేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. టెన్స్‌ మొమెంట్స్‌ను ట్యాప్‌ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం హ్యూమన్‌ బిహేవియర్‌ను అధ్యయనం చేస్తున్నాను. ఘన విజయం సాధించాను అని అనుకోవడం  లేదు కానీ నాకు తృప్తికరంగానే ఉంది ఇంతవరకూ సాగిన ప్రయత్నం అన్నారు.

ఈ అవకాశం ఫలితంగా నాకు స్వయంగా ఆర్ధికశక్తి ఏర్పడింది. దాని ఆసరాతోనే 'యవనిక' లాంటి తొలి తెలుగు థియేటర్ మాస పత్రిక ప్రయోగానికి తెగించగలిగానన్నారు. ఋతురాగాలు తర్వాత ఈటీవి, మాటీవీల్లో పలు సీరియళ్లకు మరియు వివిధ డాక్యుమెంటరీలకు, కార్పోరెట్ ఫిలింలకు రచన, దర్శకత్వం వహించారు. 2006-12 మధ్యలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

2010-12 మధ్య కాలంలో యూజీసి వారి ఆర్థిక సహకారంతో తెలుగు పద్యనాటకంపై ప్రాజెక్టు చేశారు. సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో రంగస్థల కళల శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం వారు 2012, జూలైలో ఏర్పాటుచేసిన థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) కు పెద్ది రామారావు ప్రాజెక్టు సమన్వయకర్తగా పనిచేశారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా మిస్ మీనా, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి అనే నాటకాలను తయారు చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేశారు. 

ఆధునిక నాటకరంగానికి మూల పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించేలా చేశారు. ఆ రోజున నాటకాల నిర్వహణలోనూ, నాటకరంగ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చెయ్యడంలోనూ క్రియాశీలక పాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక, శిక్షణ తరగతుల సలహాదారుగా 2013 నుంచి 19 వరకు పనిచేశారు. 2017-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. యవనిక సంపాదకత్వంగానీ, నాటక రంగ కార్యకలాపాలు గానీ నాకు పూర్తి కాలపు వ్యాపకాలు కావు. అవి నా ప్రవృత్తిలో భాగమే కానీ వృత్తి కాబోవు. "Passion with Caution" అన్నది నా నినాదం. నా కెరియర్‌ రచన మాత్రమేనని రామారావు స్పష్టం చేశారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com