కలక్షన్ కింగ్-మోహన్ బాబు

- March 19, 2025 , by Maagulf
కలక్షన్ కింగ్-మోహన్ బాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మొదట విలన్స్‌గా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి, ఆ తర్వాత స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక్కరు. విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. అలా నటన పరంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మోహన్ బాబు తోటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గత కొంత కాలంగా మోహన్ బాబు కొంతవరకు సినిమాలు తగ్గించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా అప్పుడప్పుడు తెరపై తళుక్కున మెరుస్తున్నారు. నేడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం....  

భక్తవత్సలం నాయుడు.. అనగానే కొద్దిమందికే తెలుస్తుంది. అదే మోహన్‌బాబు అనగానే ప్రేక్షకులందరి కళ్లలో ఆయన బొమ్మ కనిపిస్తుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీళ్లు రీళ్లుగా కదలాడి వారి పెదాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. ఎక్కడో.. రాయలసీమ చిత్తూరు ప్రాంతంలోని మారుమూల పల్లెలో పుట్టి పెరిగినా.. తెరపై తనని తాను ఆవిష్కరించుకోవాలనే సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆ దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమించి, మరెన్నో మైలురాళ్లను దాటి విజేతగా నిలిచారు. అందుకే ఆయన యువ సినీతారలకు స్ఫూర్తిగా చెప్తుంటారు.

మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 1952, మార్చి 19న ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా మోదుగులపాళెంలో మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. మోహన్ బాబు ఏర్పేడు, తిరుపతి మరియు చెన్నైలలో చదువుకున్నారు. తండ్రిలాగే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి చెన్నైలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 

రంగుల ప్రపంచం మీద మక్కువ ఎక్కువ కావడం వల్ల ఆయన మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరి కొంతకాలం శిక్షణ పొందారు. తర్వాత సినీ అవకాశాల వేటలో పడ్డాడు. సినిమాల్లో పనిచేయాలనే అభిరుచి ఉన్నప్పటికీ ఇండస్ట్రీ రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలకలేదు. ఆయన ఓర్పును పరీక్షించింది. స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. 

ఆ ప్రయత్నాలు ఫలించి 1969లో దర్శకుడు లక్ష్మీ దీపక్‌ దగ్గర నుంచి అప్రెంటీస్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకున్నాడు. అదీ ఆయనకు దక్కిన మొదటి అవకాశం. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా వెనువెంటనే లక్ష్మీ దీపక్‌ దగ్గర అప్రెంటీస్‌గా చేరిపోయాడు. అలా కొంత కాలం తెర వెనుక దర్శకత్వశాఖలో పనిచేశాడు. 1974లో 'కన్నవారి కలలు', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాల్లో కాసేపు కనిపించే అవకాశం ఆయన్ని వరించి వచ్చింది. ఆ సమయంలోనే టాలీవుడ్‌లో స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడింది. 

దాసరి నారాయణరావు దర్శకుడిగా మారిన సందర్భంలో భక్తవత్సలం నాయుడికి కూడా ఆ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. అదే 'స్వర్గం-నరకం' చిత్రం. సంసారం స్వర్గ సీమ కావాలన్నా, నరక కూపం అవ్వాలన్నా భార్యాభర్తల చేతుల్లోనే ఉందనే సందేశాత్మక చిత్రం అది. అప్పట్లో ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దర్శకుడిగా దాసరి అభిరుచికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే సమయంలో ఆ చిత్రంలోని నటీనటులకు తగిన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ పోషించిన భక్తవత్సలం నాయుడు.. మోహన్‌బాబు అనే తెర నామంతో క్రమేణ ప్రసిద్ధి పొందారు. 

ఆ తర్వాత కామెడీ విలన్‌గా కొన్ని చిత్రాల్లో మోహన్‌బాబు నటించారు. అలనాటి మేటి నటుల సమక్షంలో విలన్‌గా మెప్పించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్‌ చిత్రాల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'ఖైదీ కాళిదాసు' చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. నెమ్మదిగా ప్రతినాయకుడి పాత్రల నుంచి కథానాయక పాత్రలకు మోహన్‌బాబు షిఫ్ట్‌ అయ్యారు. 

1980 దశకం మోహన్‌బాబు ఎదుగుదలకు ఎంతో ఉపకరించింది. 1980లో 'త్రిలోక సుందరి', 'సీతారాములు', 1981లో 'టాక్సీ డ్రైవర్‌', 1982లో 'సవాల్‌', 1983లో 'ప్రళయ గర్జన', 1984లో 'సీతమ్మ పెళ్లి', 1985లో 'తిరుగుబోతు', 1987లో 'విశ్వనాథ నాయకుడు', 1988లో 'ఆత్మకథ' 1989లో 'బ్లాక్‌ టైగర్‌', 1990లో 'ప్రాణానికి ప్రాణం'లాంటి సినిమాలో గుర్తింపు పొందే పాత్రలు వేశాడు. 1992లో 'డిటెక్టీవ్‌ నారద', 1997లో 'వీడెవడండీ బాబు' లాంటి కామెడీ హీరో పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే, 2002లో 'తప్పు చేసి పప్పు కూడు', 2013లో 'పాండవులు పాండవులు తుమ్మెద' లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. మోహన్​బాబు.. ప్రస్తుతం డైమండ్​ రత్నబాబు దర్శకత్వంలో 'సన్​ ఆఫ్​ ఇండియా' సినిమాలో నటిస్తున్నారు. 

దర్శకుడు దాసరి నారాయణరావును మోహన్‌బాబు గురువుగా భావిస్తారు. సినీపరంగానే కాకుండా, వ్యక్తిగత విషయాలనూ చనువుగా దాసరి దగ్గర చర్చించి తగిన సలహాలు, సూచనలు స్వీకరించేవారు. ఈ సంగతి వీలు చిక్కినప్పుడల్లా ఆయనే స్వయంగా అనేకసార్లు వెల్లడించారు. ఇక, తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చిత్రసీమలో మోహన్‌బాబుకు అత్యంత శ్రేయోభిలాషి. హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు కూడా. ఆ స్నేహ ధర్మంతోనే రజినీకాంత్‌ 'పెదరాయుడు' సినిమాలో కీలకపాత్ర పోషించి.. ఆ చిత్ర విజయానికి తనవంతు చేయూత ఇచ్చారు. గాయకుడు యేసుదాస్‌ అంటే కూడా మోహన్‌బాబుకు ఎంతో ఇష్టం. తన చిత్రంలో యేసుదాస్‌తో పాడించడం ఆనవాయితీగా చేసుకున్నారు. 

అభిరుచి గల నిర్మాతగానూ మోహన్‌బాబు తనని తాను నిరూపించుకున్నారు. తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై 80 చిత్రాలు నిర్మించారు. 1992లో నిర్మాణసంస్థను ప్రారంభించిన మోహన్‌బాబు మొదటి చిత్రంగా 'ప్రతిజ్ఞ' విడుదల చేసారు. ఆ చిత్రం విజయం సాధించడం వల్ల అదే బ్యానర్‌పై 80 చిత్రాలు తీశారు. వాటిలో చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నా.. 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీగారి పెళ్ళాం', 'అల్లుడుగారు', 'మేజర్‌ చంద్రకాంత్‌', 'పెద్ద రాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి' లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. 

మోహన్‌బాబుకు విద్యారంగం అంటే ఎంతో ప్రీతి. 1992లో శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి రెండు ఇంటర్నేషనల్‌ స్కూల్స్, అయిదు కాలేజీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. రాజకీయాలపై ఆసక్తి మెండు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేసిన అనుభవం మోహన్​బాబుకు ఉంది. 

కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. ఇవే కాకుండా  ‘నటప్రపూర్ణ’, ‘డైలాగ్ కింగ్’, 'నటవాచస్పతి', ‘కల్లెక్షన్ కింగ్’ మరియు ‘యాక్టర్ ఆఫ్ ది మిలీనియం’ లాంటి పలు బిరుదులు ఉన్నాయి. ఇవే కాకుండా పలు ప్రఖ్యాత సంస్థల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు మరియు సత్కారాలను పొందారు. 

మోహన్ బాబు ఎలాంటి పాత్రనైనా సరే చేసి అలవోకగా మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కనుక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగితే ఆయనకు మంచి అవకాశాలు లైన్ కడతాయి. ఇక 70వ దశకం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న మంచు మోహన్ బాబు ఇటీవల తన నటన జీవితం‌లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మ‌రిన్ని చిత్రాల్లో న‌టిస్తూ మ‌న‌ల్ని ఎప్పుడు అలరించాలని కోరుకుంటూ.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com