' అంతం' రివ్యూ
- July 07, 2016
చిత్రం: అంతం తారాగణం: చరణ్‌దీప్.. రష్మిగౌతమ్.. వాసుదేవ్.. సుదర్శన్ తదితరులు సంగీతం: కార్తీక్ రాడ్రిగ్జ్, పతాకం: శ్రీ గాయత్రి ఆర్ట్ మూవీస్, నిర్మాణం: జి.సత్యనారాయణ, కథ.. స్క్రీన్‌ప్లే, కూర్పు, దర్శకత్వం: జి.ఎస్.సి.పి. కల్యాణ్ విడుదల: 7-7-2016
బుల్లితెరతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటి రష్మిగౌతమ్. 'జబర్దస్త్'తో ఇంటింటికీ చేరువైంది. ఆమె అందాన్ని చూసి కుర్రకారు ఫిదా అయిపోతుంటుంది. ఆ విషయమే సినిమా రంగాన్నీ ఆకర్షించింది. అందుకే రష్మి అందమే ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. 'గుంటూరు టాకీస్' తర్వాత ఆ కోవలో తెరకెక్కిన మరో చిత్రమే 'అంతం'. ఒక చిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మి తన అందంతో ఎంతవరకు ఆకట్టుకుందో చూస్తే..!
కథేంటంటే?: హైదరాబాద్‌లో రోజూ ఆఫీసుకి వెళ్లొచ్చే ఓ సగటు గృహిణి వనిత అలియాస్ చిన్ని (రష్మిగౌతమ్). భర్త బుజ్జి (చరణ్‌దీప్) ఉద్యోగం రీత్యా విజయవాడ వెళ్లడంతో ఆయనకోసం ఎదురు చూస్తుంటుంది? ఈ నేపథ్యంలో ఓ రోజు కారులో హైదరాబాద్‌కి బయల్దేరిన బుజ్జికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ సందేశం అందుతుంది. నీ భార్యని కిడ్నాప్ చేస్తున్నామనేదే ఆ సందేశం. వాళ్లు చెప్పినట్టుగానే క్షణాల్లో చిన్నిని కిడ్నాప్ చేస్తారు. నీ భార్యని వదిలిపెట్టాలంటే మేం చెప్పినట్టు చేయాలని చెబుతారు. అందుకు ఒప్పుకొన్న బుజ్జి వాళ్లు చెప్పిన ప్రదేశానికి వెళ్లి అక్కడ నుంచి ఓ బ్యాగ్‌ని తీసుకొస్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? దాన్ని తెచ్చాక చిన్నిని వదిలిపెట్టారా లేదా? కిడ్నాప్ వెనుక ఉన్నదెవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: కాన్సెప్ట్ సినిమాలు కొన్నిసార్లు అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అయితే ఆ అద్భుతం ఒట్టి కాన్సెప్ట్‌తోనే సాధ్యం కాదు. వాటి వెనుక, ముందూ బలమైన సన్నివేశాల్ని అల్లుకొంటేనే ప్రయత్నం ఫలిస్తుంది. 'అంతం' కాన్సెప్ట్‌లోనే బోలెడు లొసుగులుండగా, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు మరింత పేలవంగా ఉన్నాయి. తీవ్రవాదులు, బాంబులు అంటూ కథలో పెద్ద పెద్ద విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. కానీ తెరపై కనిపించే సన్నివేశాలు మాత్రం దానికి తగినట్టుగా లేకుండా సాదాసీదాగా సాగిపోతుంటాయి. మీ వూహకందనిది ఏదో జరగబోతోంది.. అంటూ సాగే ప్రచార చిత్రాల్ని చూసి ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమా అనుకొని వెళ్తే నిరాశ తప్పదు. విజయవాడలో మొదలై దారి గుండా సాగుతూ హైదరాబాద్‌లో ముగిసే కథ ఇది. ఉగ్రవాదులు చెప్పిన ప్రదేశాలకు వెళ్తూ అక్కడి వస్తువుల్ని తీసుకొని రావడమే హీరో పని. మధ్యలో వాళ్లతో ఫోన్లు మాట్లాడటం. దాదాపు కథంతా అదే. కార్లోకి సుదర్శన్‌ని ఎక్కించి వినోదం పండించే ప్రయత్నం చేశారు. ప్రియాంక ప్రియాంక... అంటూ సుదర్శన్ ఎంత హడావుడి చేసినా నవ్వులు మాత్రం పండలేదు. భార్యని కిడ్నాప్ చేశారని ఉగ్రవాదులు చెప్పిందల్లా భర్త చేసేస్తాడా? తనవంతుగా ఏమీ చేయడా? అనే విషయాలు లాజిక్‌కి అందవు.
ఎవరెలా చేశారంటే?: సినిమాకి ప్రధాన ఆకర్షణగా కనిపించే రష్మి సందడి తొలి, చివరి పది నిమిషాలు మాత్రమే. తెరపై కనిపించేది కాసేపే అయినా రష్మి ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాలు హీరో చరణ్‌దీప్ చుట్టూనే సాగుతాయి. కానీ ఆయన దాదాపుగా ప్రతీ సన్నివేశంలోనూ ఒకలాగే కనిపిస్తాడు. సుదర్శన్ అమాయకుడిగా కనిపించి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. కెమెరా పనితనం ఫర్వాలేదనిపించినా, సంగీతం పేలవంగా ఉంది. ఈవేళలో... పాటనే మరోసారి వినిపించారు. ఆ పాటలో రష్మి ఘాటుగా కనిపించింది.
+ రష్మి
- కథకు తగిన సన్నివేశాలు లేకపోవటం - సంగీతం
చివరిగా: ఆకట్టుకోని అంతం గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









