యుగకర్త-కందుకూరి
- April 16, 2025
తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం ఒకరు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి.
కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు.వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.
చదువుకునే రోజుల్లో రామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్,కేశవ చంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ల పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చారు.
సామాజిక దురాచారాల నిర్మూలన కోసం వీరేశలింగం ఎంతో కృషి చేశారు. ఆయన ఆధునిక ఆంధ్ర పితామహుడిగా కీర్తి గడించారు.దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశ లింగం కావడం గమనార్హం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలను కొనిచ్చేవారు.
స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన ఉద్యమమే నిర్వహించారు. సమాజంలోని దురాచారాల పై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. కందుకూరి "హాస్య సంజీవిని" అనే హాస్య పత్రికను సైతం ప్రారంభించారు. తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని ఈ పత్రికలోనే ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి.
యుగకర్తగా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన పంతులుగారికి గద్య తిక్కన అనే బిరుదు కూడా ఉంది. మొదటి స్వీయ చరిత్ర, తొలి నవల, తొలి ప్రహసనం, తొలి తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. సమాజ సేవ కోసం హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని వీరేశలింగం ఆ సంస్థకు ఇచ్చేశారు.
పంతులు 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితునిగా పని చేశారు. తెలుగు పండితుడిగా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఐదేళ్లు పని చేశారు. తెలుగులో 130కి పైగా గ్రంథాలను రాశారు. సత్యరాజ పూర్వ దేశయాత్రలు, రాజశేఖర చరిత్ర ఆయన రచనలలో ముఖ్యమైనవి.
ఆయన ప్రభుత్వంలో అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్నారు.ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!