విలక్షణ నిర్మాత-ఏడిద నాగేశ్వరరావు
- April 24, 2025
ప్రపంచ సినీయవనికపై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన వ్యక్తి 'పూర్ణోదయా' నాగేశ్వరరావు. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన తమ బ్యానర్ 'పూర్ణోదయా' ద్వారా తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేశారు. వ్యాపార ధోరణి పేరుతో తెలుగు సినిమా అదుపుతప్పితే ఆపద్భాందవుడిలా ఆదుకున్నారు. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. నేడు విలక్షణ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
'పూర్ణోదయా' నాగేశ్వరరావుగా సినీ రంగానికి సూపరిచితులైన ఏడిద నాగేశ్వరరావు 1934, ఏప్రిల్ 24న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన సంపన్న రైతు కుటుంబంలో ఏడిద సత్తిరాజు నాయుడు, పాపలక్ష్మి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొత్తపేట, కాకినాడలో పూర్తి చేసిన వారు పిఠాపురం రాజాస్ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్ పూర్తి చేశారు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తిని పెంచుకున్న ఆయన స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్ మెడల్‌ను కూడా అందుకున్నారు.
ఆ ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత ఏడిద వారు విజయనగరంలో ఇంటర్‌మీడియట్ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’లో కొన్ని నాటకాలు ఆడారు. బిఎ చదువుతున్న రోజుల్లో ఆయనకు కృష్ణాజిల్లాకు చెందిన వి.బి.రాజేంద్రప్రసాద్ గారితో పరిచయం ఏర్పడి, సన్నిహిత మిత్రులయ్యారు. ఇరువురూ కలిసి కాలేజీ రోజుల్లో నాటకాలు వేస్తూ వచ్చారు. చదువయ్యాక రాజేంద్రప్రసాద్ మద్రాసు చేరి, నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా ‘అన్నపూర్ణ’అనే చిత్రం నిర్మించారు. అందులో ఓ వేషం కోసం ఏడిద నాగేశ్వరరావును పిలిపించారు.
మిత్రుడి పిలుపు మేరకు మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది. చేసేది లేక పట్టుదలతో అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు. ఎన్టీఆర్ ‘ఆత్మబలం’లో ఎస్వీ రంగారావు రెండో కొడుకుగా నటించారు ఏడిద. ఆ సినిమా గుర్తింపు సంపాదించి పెట్టింది. తరువాత ఏయన్నార్ ‘పవిత్రబంధం’లో డాక్టర్ వేషం వేశారు. “నేరము-శిక్ష, రణభేరి, మానవడు-దానవుడు, బంగారుబాబు, చిన్ననాటి స్నేహితులు” వంటి చిత్రాల్లో నటించారు. ఏడిద వారు దాదాపు 30 చిత్రాల్లో నటించారు, వందకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
నటుడిగా కొనసాగుతున్న సమయంలోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ గారితో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచీ ఇద్దరూ సినిమాలు, వాటిలో కళాత్మక విలువల గురించి చర్చించుకుంటూ ఉండేవారు. కాకినాడకు చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, వీర్రాజు అనే మిత్రులతో కలసి ‘వేంకటేశ్వర కళ్యాణం’ అనే అనువాద చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టింది. దాంతో మిత్రులు ఏదైనా స్ట్రెయిట్ మూవీని తెరకెక్కించాలని భావించారు. కె.విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధంతో ఆయన్ను కలిశారు.
1976లో మిత్రుల ప్రోత్సాహంతో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 'సిరి సిరి మువ్వ' చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో 'తాయారమ్మ బంగారయ్య'ను నిర్మించారు. అది మంచి విజయం సాధించింది.
విశ్వనాథ్‌తో ఉన్న అనుబంధంతో ఆయన వద్ద సంగీతసాహిత్యాలతో మిళితమైన ఓ మంచి కథ ఉందని తెలుసుకున్నారు ఏడిద నాగేశ్వరరావు. అయితే విశ్వనాథ్ సైతం అలాంటి చిత్రాలను జనం ఆదరిస్తారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయినా, తీస్తే అలాంటి సినిమా తీయాలని భావించారు ఏడిద. తాడి రామకృష్ణ, తాడి హరిబాబు, తాడి బాబ్జీ వంటి మిత్రుల ఆసరాతో ఆకాశం శ్రీరాములు, ఏడిద సంయుక్తంగా ‘శంకరాభరణం’ చిత్రాన్ని నిర్మించారు.
శంకరాభరణం సినిమా 1979లోనే పూర్తయింది. అయితే, ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. పంపిణీదారులకు పలు ప్రదర్శనలు వేశారు. చివరకు లక్ష్మీఫిలిమ్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో, ఇతర ఏరియాల వారూ సరే అన్నారు.
1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ మొదటి వారం కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలు మాత్రమే ప్రదర్శితమైంది. మెల్లగా పాజిటివ్ మౌఖిక ప్రచారం సాగింది. ‘శంకరాభరణం’ భలే బాగుందన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో ఉదయం ఆటలేవేసిన థియేటర్లు రెగ్యులర్ షోస్ ప్రదర్శించాల్సి వచ్చింది.
12 కేంద్రాల్లో వంద రోజులు చూసిన ‘శంకరాభరణం’ తెలుగునేలపైనే కాదు, కన్నడ,తమిళ,మళయాళ సీమల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మంచి లాభాలు చూసింది. ఆ రోజుల్లో టాప్ స్టార్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే ఘనవిజయం సాధిస్తే కోటి రూపాయలు వసూలు చేసేవి. అలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ తో రూపొంది, అంతగా పేరులేని వారు ప్రధాన పాత్రలు పోషించగా తెరకెక్కి అనూహ్యంగా అన్నిచోట్లా కలిపి కోటి రూపాయలు పోగేసింది.
ఏడిద వారికీ, మిత్రులందరికీ మంచి లాభాలు రావడంతోపాటు ఎనలేని కీర్తి కూడా దక్కింది. ఎక్కడికి వెళ్ళినా వీరిని ‘శంకరాభరణం’ నిర్మాత అని పిలిచేవారు. అందుకే ఆయన హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంటికి ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు.
శంకరాభరణం తర్వాత ఏడిద ఒక్కరే ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలలో కొన్నిటికి తాడి రామకృష్ణ, హరిబాబు, బాబ్జీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భారతీరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ నిర్మించారు. ఇళయరాజా బాణీల్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఆపై కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, జయప్రదతో ‘సాగరసంగమం’ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఇళయరాజా బాణీల్లోనే మరో మ్యూజికల్ హిట్‌ను అందించింది.
పూర్ణోదయ సంస్థ నుండి ఓ సినిమా వస్తోందంటే అందులో తప్పకుండా సంగీతసాహిత్యాలకు పెద్ద పీట వేసి ఉంటారని ప్రేక్షకులు భావించేవారు. అందుకు తగ్గట్టుగానే ఏడిద నాగేశ్వరరావు చిత్రాలను నిర్మిస్తూ ముందుకు సాగారు. ఆయన తెరకెక్కించిన “స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు” చిత్రాలన్నీ సంగీత పరంగా అలరించాయి. తమ సంస్థలో వచ్చిన తోలి చిత్రం ‘తాయారమ్మ-బంగారయ్య’లో ఓ చిన్న బిట్ రోల్ పోషించిన చిరంజీవి, తరువాత టాప్ స్టార్ అయ్యాక ఆయనతో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో “స్వయంకృషి, ఆపద్బాంధవుడు” వంటి చిత్రాలను నిర్మించారు.
నిజానికి చిరంజీవి కాల్ షీట్స్ ఇవ్వగానే ఓ భారీ కమర్షియల్ తీసేయవచ్చు. అయితే ‘శంకరాభరణం’ పేరు చెడిపోకుండా, తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మించారు. ‘స్వరకల్పన’ ద్వారా తన తనయుడు శ్రీరామ్ ను హీరోగా పరిచయంచేశారు.
ఏడిద వారు తర్వాత కాలంలో తీసిన చిత్రాల్లో కొన్ని అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. అయితే, ఆయన ఏ నాడూ రాజీపడి విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు. కడదాకా అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఏడిద నాగేశ్వరరావు గారు 2015, అక్టోబర్ 4న అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. భౌతికంగా ఏడిద నాగేశ్వరరావు లేకపోయినా, ఆయన సినిమాల ద్వారా జనం మదిలో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు.
-=డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







