మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భేటీ

- July 08, 2016 , by Maagulf
మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భేటీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమాను కలవనున్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా గురువారం మోదీ మొజాంబిక్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొజాంబిక్‌ పర్యటన ముగించుకున్న ఆయన శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకున్నారు.
అధ్యక్షుడితో భేటీ అనంతరం ఇవాళ సాయంత్రం జొహన్నెస్‌బర్గ్‌లోని మైదానంలో వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొనే కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, భారత్‌కు ఆ దేశంతో చరిత్రాత్మకమైన, గాఢమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఒక లాయరుగా వెళ్లి రెండు దశాబ్దాలు అక్కడ గడిపిన గాంధీపై దక్షిణాఫ్రికా చూపిన ప్రభావం ఏపాటిదో ప్రపంచానికి తెలుసని, ఆ తర్వాత చరిత్రనే మలుపు తిప్పే సంఘటనలకు గాంధీ కారణమయ్యారని మోదీ పేర్కొన్నారు. శనివారం దక్షిణాఫ్రికాలో ఎక్కువ మంది భారతీయులు నివసించే డర్బన్‌ ప్రాంతంలో మోదీ పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాతో భారత్‌ వాణిజ్య సంబంధాలు మరింత బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com