ఒమన్‌లో ఇంధన కేంద్రాల కోసం కొత్త నిబంధనలు జారీ..!!

- May 05, 2025 , by Maagulf
ఒమన్‌లో ఇంధన కేంద్రాల కోసం కొత్త నిబంధనలు జారీ..!!

మస్కట్: ఇంధన ఫిల్లింగ్ స్టేషన్‌లను స్థాపించడానికి, నిర్వహించడానికి లైసెన్స్‌లను జారీకి సంబంధించి వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు సంబంధిత పార్టీలందరూ తమ స్థితిని సరిదిద్దుకోవాలని తెలిపంది. ఈ నిబంధనలోని నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ పొందకుండా ఇంధన ఫిల్లింగ్ స్టేషన్‌లను స్థాపించడం, నిర్వహించడం వంటి కార్యకలాపాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.  మొబైల్ ఇంధన కేంద్రాలు కాకుండా, సైట్ బయట ఇంధనాన్ని విక్రయించడాన్ని తాజాగా నిషేధించారు.    

ఇంధన స్టేషన్‌లను ఏర్పాటుకు గైడ్ లైన్స్

రహదారి డ్యూయల్ క్యారేజ్‌వే కాకపోతే, ఏదైనా ప్రతిపాదిత ఇంధన ఫిల్లింగ్ స్టేషన్, ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్న లేదా ఆమోదించబడిన స్టేషన్ మధ్య దూరం ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.ఇది అన్ని గవర్నరేట్‌లు , విలాయత్‌లకు వర్తిస్తుంది. మస్కట్ గవర్నరేట్, సలాలా, సోహార్‌లోని విలాయత్‌లను మినహాయించారు.  రెండు ఇంటిగ్రేటెడ్ ఇంధన స్టేషన్‌ల మధ్య దూరం ఒకే దిశలో యాభై కిలోమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.  ప్రతిపాదిత స్థలం టైటిల్ డీడ్, లీజు ఒప్పందం లేదా వినియోగ హక్కు ద్వారా పొందాలని సూచించారు. ఎలివేటెడ్, మెరైన్ , మొబైల్ ఇంధన స్టేషన్లను మినహాయించారు. 

వాణిజ్య ఇంధన స్టేషన్లు

వాణిజ్య ఇంధన స్టేషన్ కోసం సైట్ వైశాల్యం ఇప్పటికే ఉన్న స్టేషన్లను మినహాయించి 3,000 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.  మొబైల్ ఇంధన కేంద్రాల కోసం పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ నుండి అనుమతి పొందాలి. ఇంధన కేంద్రాన్ని స్థాపించి నిర్వహించాలనుకునే ఏ పార్టీ అయినా లైసెన్స్ పొందిన ఇంధన మార్కెటింగ్ కంపెనీకి దరఖాస్తును సమర్పించాలి. అన్ని సరిగ్గా ఉంటే, అవసరమైన రుసుము చెల్లించిన తర్వాత నిర్మాణాన్ని ప్రారంభించడానికి తాత్కాలికంగా ఒక సంవత్సరం లైసెన్స్ జారీ అవుతుంది. ఆ వ్యవధిలోపు ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే, లైసెన్స్ రద్దు చేస్తారు. రెండు సంవత్సరాల పాటు దరఖాస్తును పునఃపరిశీలనకు అంగీకరించరు. తుది లైసెన్స్ ముప్పై రోజుల్లోపు జారీ చేస్తారు. ఇది మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.   

రాయల్ ఒమన్ పోలీసులతో సమన్వయంతో భద్రతా చర్యల అమలును నిర్ధారిస్తారు. ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ సౌకర్యాలను అందించడం, 24/7 భద్రతా నిఘా వ్యవస్థను నిర్వహించడం, నియంత్రణ అధికారుల తనిఖీలకు మద్దతును అందించాలి.  రోజుకు ఒక వాహనానికి 100 లీటర్లకు మించి ట్యాంకులు లేదా బారెల్స్‌లో ఇంధనం నింపడాన్ని నిషేధించారు. లావాదేవీలన్నింటినీ నమోదు చేయాలి. నెలవారీ నివేదికలను సంబంధిత విభాగానికి సమర్పించాలి.

పరిపాలనా జరిమానాలు

నిబంధనలను ఉల్లంఘించే వాటిపై నోటీసులు జారీతోపాటు OMR1,000 నుండి OMR3,000 వరకు జరిమానాతో సహా అనేక పరిపాలనా జరిమానాలను విధిస్తారు. వీటిలో పునరావృత ఉల్లంఘనలు లేదా లైసెన్స్ సస్పెన్షన్ లేదా జరిమానాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కార్యకలాపాలు కొనసాగించే వారికి నెలవారీ OMR500 జరిమానా విధించబడుతుంది.వార్షిక రుసుము చెల్లింపును ఆలస్యం చేసే మార్కెటింగ్ కంపెనీపై OMR5,000 జరిమానా విధించబడుతుంది. చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా ఆరు నెలల పాటు సేవలను అందించలేక పోతే లైసెన్స్ రద్దు చేయబడుతుందని మంత్రిత్వశాఖ తన నిబంధనల్లో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com