గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!

- May 18, 2025 , by Maagulf
గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!

మస్కట్: శనివారం ఉదయం బౌషర్‌లో భవనం కూలిన ఘటనలో భారతీయ దంపతులు మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.  30 సంవత్సరాలకు పైగా ఒమన్‌లో నివసిస్తున్న ఈ జంట.. అనుమానాస్పద గ్యాస్ పేలుడు కారణంగా వారుంటున్న భవనం కుప్పకూలింది. మృతులను 59 ఏళ్ల పంకజాక్షన్, అతని భార్య 53 ఏళ్ల షాజితగా గుర్తించారు. ఇద్దరూ దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కన్నూర్‌కు చెందినవారిగా గుర్తించారు. వారు గ్రౌండ్ ఫ్లోర్ రెస్టారెంట్ పైన ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అక్కడ పేలుడు సంభవించిందని భావిస్తున్నారు.

సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. రెస్టారెంట్‌లో వంట గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. "లాంఛనాలను పూర్తి చేసి వారి మృతదేహాలను ఇంటికి తిరిగి తీసుకురావడానికి మేము సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నాము" అని అన్నారు. ఇండియాలోని చెన్నైలో చదువుతున్న వారి కుమార్తెకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.  ఆమె వీలైనంత త్వరగా ఒమన్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

మృతులు పంకజాక్షన్, షాజిత ఇద్దరూ ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్లుగా పనిచేశారు. స్థానిక ప్రవాస కమ్యూనిటీలో వారు ప్రశంసనీయమైన సేవలను అందిస్తున్నారు. వారి ఆకస్మిక, విషాదకరమైన మరణం వారి స్నేహితులు, సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి మృతికి ఒమన్ లోని ఇండియన్ కమ్యూనిటీ సంతాపం వ్యక్తం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com