రెండో దఫా మొదలైన కూల్చివేతలు..ఈ సారి 2500 ఇళ్లు నేలమట్టం!

- May 20, 2025 , by Maagulf
రెండో దఫా మొదలైన కూల్చివేతలు..ఈ సారి 2500 ఇళ్లు నేలమట్టం!

అహ్మదాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఉన్న చందోలా సరస్సు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన నివాసాలపై ప్రభుత్వం మళ్లీ కన్నెర్ర చేసింది. రెండో దశలో 2500కి పైగా ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయి.అహ్మదాబాద్ యంత్రాంగం మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో ఒక పెద్ద కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2500కు పైగా అక్రమంగా నిర్మించిన ఇళ్లలో ఎక్కువ భాగం అక్రమంగా దేశంలోని ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయులకు చెందినవిగా భావిస్తున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీలలో నిర్వహించిన మొదటి దశలో దాదాపు 3 వేల ఇళ్లను కూల్చేశారు. రెండు దశలలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, దశాబ్దాలుగా అదుపు లేకుండా విస్తరించిన చొరబాటు, అక్రమ స్థావరాల సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.

ఆపరేషన్ సాఫల్యం కోసం భారీ లాజిస్టికల్ మద్దతు
కూల్చివేతను సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించడానికి 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. కూల్చివేతల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఏకంగా 8,000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. నివేదికల ప్రకారం.. చందోలా సరస్సు చాలా కాలంగా పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారులకు నిలయంగా గుర్తించారు. ఈ ప్రాంతంలో అక్రమ భూమి ఆక్రమణ 1970, 80లలో ప్రారంభమైంది. 2002లో ఒక NGO సియాసత్ నగర్ అనే స్థావరాన్ని స్థాపించడానికి సహాయం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, నకిలీ డాక్యుమెంటేషన్ నెట్‌వర్క్‌లకు హాట్‌స్పాట్‌గా మారింది.

అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల పై ఆరోపణలు
2010, 2024 మధ్య అక్రమ నిర్మాణాల వేగం భారీగా పెరిగింది.సరస్సు సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేలాది తాత్కాలిక ఇళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గత కొన్ని వారాలుగా గుజరాత్ పోలీసులు వేలాది మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది అహ్మదాబాద్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో వ్యక్తులు చందోలా సరస్సు ఆక్రమణ మండలాల్లో నివసిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అధికారుల ప్రకారం.. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రభుత్వ భూమిని తిరిగి పొందడం మాత్రమే కాదు, చట్టవిరుద్ధమైన వలసలను అరికట్టడం, మురికివాడల ముసుగులో పనిచేస్తున్న నేరస్థుల నెట్‌వర్క్‌లను నిర్మూలించడం కూడా.ఈ కూల్చివేత ఆపరేషన్ ఒకవైపు న్యాయబద్ధమైన శాసన అమలు, మరోవైపు మానవతా కోణం మధ్య సవాళ్లను తెచ్చిపెట్టింది.చందోలా సరస్సు ప్రాంతాన్ని తిరిగి శుద్ధంగా మార్చాలనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ దీని ప్రభావం మానవ జీవితాలపై ఎలా పడుతుందో గమనించాల్సిన అవసరం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com