యాంగ్రీ మ్యాన్ విజయనాయక-జీవిత

- May 24, 2025 , by Maagulf
యాంగ్రీ మ్యాన్ విజయనాయక-జీవిత

“కార్యేషు దాసి…కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తెలుగు చిత్రసీమలోని అరుదైన జంటల్లో జీవిత- రాజశేఖర్ సైతం చోటు సంపాదించారు. అంతకు ముందు నటిగా రాణించిన జీవిత, తరువాతి రోజుల్లో రాజశేఖర్ హిట్ పెయిర్ గా అలరించారు. ఆపై జీవిత కాస్తా జీవితా రాజశేఖర్ అయ్యారు. అప్పటి నుంచీ తన పతిదేవుని విజయానికై జీవిత సైతం తనవంతు కృషి చేశారు. అందువల్లే రాజశేఖర్ విజయం వెనుక ఉన్నది జీవిత అని సినీజనం సైతం ఇట్టే చెప్పేస్తారు. నేడు నటి, దర్శకురాలు జీవిత జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం....

జీవిత 1966, మే 24న జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం చెన్నైలోనే సాగాయి. మాతృభాష తెలుగైన, ఆమెకు ఆరంభంలో తమిళ చిత్రాల్లోనే అవకాశాలు లభించాయి.తమిళనాట బహుముఖ ప్రజ్ఞతో సాగిన టి.రాజేందర్ రూపొందించిన ‘ఉరవై కథా కిలి’ అనే తమిళ చిత్రంతో జీవిత తెరంగేట్రం చేశారు. తరువాత “సెల్వి, నానే రాజా నానే మంత్రి, ఇలమై, ఎంగ కురళ్, ఆయిరమ్ కన్నుదయాల్, ధర్మపత్ని” వంటి తమిళ చిత్రాలలో నటించి అలరించారు.  కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు.

ఆ తర్వాత “తలంబ్రాలు, బావామరదుల సవాల్, జానకిరాముడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, అన్నాచెల్లెలు, మంచివారు మావారు, అంకుశం” చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ తో కలసి ఆమె నటించిన “తలంబ్రాలు, ఆహుతి, అంకుశం” చిత్రాలు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. రాజశేఖర్ హీరోగా ‘మగాడు’ చిత్ర నిర్మాణంలో జీవిత పాలు పంచుకున్నారు. 1991లో జీవిత, రాజశేఖర్ పెళ్ళాడారు. ఆ తరువాత నుంచీ జీవిత ఇంటికే పరిమితమై, భర్త విజయం కోసం కృషి చేస్తూ వచ్చారు. రాజశేఖర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలకు ఆమె నిర్మాణ బాధ్యతలూ నిర్వహించారు. భర్త స్టార్ హీరోగా నిలవడానికి ఓ భార్యగా జీవిత ఎంతో నైతిక బలం అందించారు.

రాజశేఖర్ హీరోగా రూపొందిన ‘శేషు’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన జీవిత, ఆ తరువాత భర్త హీరోగా రూపొందిన “ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి” చిత్రాలకూ మెగాఫోన్ పట్టుకున్నారు.జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు – శివానీ, శివాత్మిక. వారిద్దరూ కన్నవారి బాటలోనే పయనిస్తూ సినిమాల్లో అడుగు పెట్టారు. రాజశేఖర్, జీవిత ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రీజనల్ సభ్యురాలిగా జీవిత బాధ్యతలు చేపట్టారు.

తెలుగు చిత్రసీమలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. ఆ తరువాత జీవిత, రాజశేఖర్ దంపతులకు ఆదర్శంగా కనిపిస్తారు. రాజశేఖర్ ఇప్పటికీ హీరో పాత్రలే వేస్తూ సాగుతున్నారు. ఆయన పయనంలో సదా జీవిత నీడగానే ఉన్నారు. అలాగే తమ పిల్లల నటజీవితం బాగుండేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. జీవిత, రాజశేఖర్ దంపతులు చిత్రసీమలో అందరికీ సన్నిహితంగా సాగుతున్నారు. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం అందించేందుకు ఈ దంపతులు ఎప్పుడూ ముందుంటారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com