డబ్బింగ్ దిగ్గజం-పి.జె.శర్మ

- May 24, 2025 , by Maagulf
డబ్బింగ్ దిగ్గజం-పి.జె.శర్మ

తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ కళకు మంచి ప్రాచుర్యం సంపాదించి పెట్టిన వారిలో ప్రముఖులు పి.జె. శర్మ. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా నటుడిగానూ పలు పాత్రలతో అలరించారు. ప్రెజెంట్ టాలీవుడ్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులు అనగానే ముందుగా గుర్తొచ్చేది డైలాగ్ కింగ్ సాయి కుమార్, రవిశంకర్, అయ్యప్ప. అయితే, ఈ అన్నాదమ్ములిద్దరికీ ఆ డబ్బింగ్ వారసత్వం వారి తండ్రైన వీరి నుంచే వచ్చింది. దాదాపు 500 చిత్రాల్లోని పలువురి నటులకు తన గాత్రాన్ని అందించారు శర్మ. తనదైన గాంభీర్యమైన కంఠంతో ఆన్ స్క్రీన్ పై ఆయా పాత్రలకు డాబూ, దర్పాన్ని ఆపాదించారు. నేడు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పి.జె.శర్మ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం....

పి.జె.శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. 1933, మే 24న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త విశాఖపట్నం జిల్లా గజపతినగరం తాలూకా కళ్ళేపల్లి రేగ గ్రామంలో మధ్యతరగతి బ్రాహ్మణ కుటంబానికి చెందిన పూడిపెద్ది వెంకట నరసింహం, కమలమ్మ దంపతులకు జన్మించారు. ఎస్.ఎల్.సి వరకు చదువుకున్న ఆయన రైల్వే ఉద్యోగంలో కొంత కాలం పనిచేశారు. చదువుతున్న రోజుల్లో నాటకాలపై ఉన్న మక్కువతో పేదరైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులంలేని పిల్ల, ఋష్యశృంగ, నవప్రపంచం మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలను పోషించారు.  

సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లి 1954లో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తీసిన అన్నదాత చిత్రంలో ఒక చిన్నపాత్రలో నటించారు. ఆ తర్వాత తిరిగి ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేస్తూ వచ్చారు. 1957లో విజయనగరం రాఘవ నాటక కళాపరిషత్ పోటీల్లో పాల్గొని సినీ ప్రముఖుల ఆహ్వానం మీద మద్రాసు చేరుకున్నారు. ఆరుద్ర, శ్రీశ్రీల ప్రోత్సాహంతో తొలిసారిగా ఉత్తమ ఇల్లాలు (1957) చిత్రంలో డబ్బింగ్ చెప్పారు.

1957 లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇల్లరికం ఆయనకు నటుడిగా మొదటి సినిమా. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ కుమార్ ప్రేమనజీర్ ధరించిన ఎన్నో పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

'రంగులరాట్నం', 'కలెక్టర్ జానకి', 'భక్తతుకారం', 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'దానవీర శూర కర్ణ', 'కురుక్షేత్రం', 'రామ్ రాబర్ట్ రహీమ్', 'న్యాయం కావాలి', 'విజేత', 'కర్తవ్యం', 'తొలిప్రేమ' వంటి చిత్రాలలో శర్మ పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. పి.జె.శర్మ తనయులు సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ నటులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా దూసుకుపోతున్నారు. మనవడు ఆది సైతం హీరోగా సత్తా చాటుతున్నాడు. వెండితెరపై నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పి.జె.శర్మ 2014, డిసెంబర్ 14న పరమపదించారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com