ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

- May 31, 2025 , by Maagulf
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

దేహం ఎంత ధృఢం గా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్ర కు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి,తెలుసుకోవటానికి వైద్యం చదవ నవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1987లో ప్రారంభించింది. పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం, పొగాకు వినియోగాన్ని తగ్గించే విధానాల కోసం కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. అధికారిక దినోత్సవం తొలిసారి 1988లో జరిగింది. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం థీమ్ 'ప్రకాశవంతమైన ఉత్పత్తులు. చీకటి ఉద్దేశాలు. ఆకర్షణను బయటపెట్టడం (Bright products. Dark intentions. Unmasking the Appeal)'. ఆకర్షణీయమైన రుచులు, ప్యాకింగ్‌లలో వచ్చే పొగాకు ఉత్పత్తుల వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ ఏడాది లక్ష్యం.

సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే. దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడి లో నీ పొగాకు తో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డి. ఎన్.ఏను నాశనం చేసే పనిలో పడతాయి. అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా..సిగరెట్ అలవాటు కు ముందు ,ఆ తర్వాత అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ”కూర్చిన” రచయితలు , కవులు,కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్ల నే చిత్ర పరిశ్రమ కు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాలి చేసి పర్సు ఖాలి చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.

దొస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు. అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్‌కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలు ఉన్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటు కు “దగ్గర” అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమా ల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువతను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. అయినా..ఎవరో వచ్చి చెప్తే నే .. “బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్” అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.

సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కందరాల్ని ఐనా తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్)అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్‌కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డి.ఎన్. ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాల పై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యంకు కూడా కణాల ఆరోగ్యం అవశ్యం. సిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డి.ఎన్. ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెళ్లిగా రోగ నిరోధక శక్తి నీ దారుణంగా దెబ్బ తీస్తాయి. దీంతో దేహానికి పోరాడదాం అని ఆశ పడే సత్తాను కూడా సమాధి చేస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 13-15 సంవత్సరాల వయస్సు గల 37 మిలియన్ల మంది టీనేజర్లు పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. కేవలం బాల్యాన్నే కాదు. పెద్దల ఆరోగ్యాన్ని పొగాకు ఉత్పత్తులు నాశనం చేస్తున్నాయి. పొగాకులో క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలు దాదాపు 70 వరకూ ఉంటాయి. ప్రజల ప్రాణాలను పొగాకు పీల్చేయకూడదంటే దీని గురించి తెల్సుకోవడమే కాదు. ఇతరుల్లోనూ అవగాహన పెంచేందుకు కృషి చేయడం అవసరం. ఎందుకంటే పొగాకు సేవించేవారి వల్ల వారితో కలిసి జీవించే వారి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వాటిలో పొగాకు వాడకం కూడా ఒకటి. ఏటా 8 మిలియన్లకు పైగా మరణాలకు పొగాకు ఉత్పత్తులే మూల కారణంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఏడాది మే 31న ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు పొగాకు వాడకాన్ని అరికట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. పొగాకు సేవనం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా నష్టపోతారో కూలంకషంగా వివరిస్తున్నారు. భవిష్యత్ తరాలను పొగాకు ఉత్పత్తుల నుంచి రక్షించేందుకు కృషి చేస్తున్నారు.

పరిశ్రమలు స్వలాభం కోసం పిల్లలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నాయి. పొగాకు, నికోటిన్ పరిశ్రమలు రాబోతున్న కొత్త తరం కస్టమర్లను ఆకర్షించడానికి, ఇదివరకే పొగాకు సేవించేవారిని మరింత ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణీయమైన ఉత్పత్తులను, మోసపూరిత వ్యూహాలను అనుసరిస్తున్నాయి. అందువల్లే ఈ మధ్య పొగాకు కారణంగా నవయవ్వనంలోనే క్యాన్సర్, తీవ్రశ్వాసకోస వ్యాధులు ప్రజలను కాటేస్తున్నాయి. ఈ దుష్పరిణామాల నుంచి తప్పించుకోవాలంటే పొగాకు సేవనం మానేయడంతో పాటు ఇతరుల్లోనూ అవగాహన పెంచేందుకు కృషి చేయడం అవసరం.

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com