తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ కలకలం..
- June 04, 2025
హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి.తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇదివరకే వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే.. దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కలకలం రేపుతోంది. కోవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
కర్నూల్ జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్..
కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌కు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణకాలనీకి చెందిన ప్రొఫెసర్ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేయాలి..
కరోనా నిర్ధారణ అయిన ఎమ్మిగ నూరు మండలం కలుగోట్ల రోగిని పాతగైనిక్ విభాగంలోని కోవిడ్ వార్డుకు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఆ రోగిని వీఐపీ నెగిటివ్ ప్రెజర్ రూంకు తరలించారు. పాత గైనిక్ విభాగంలోని కోవిడ్ వార్డుకు బాత్‌రూంలు లేకపోవడంతో రోగిని తరలించినట్లు సిబ్బంది చెబుతున్నారు. పాత గైనిక్ విభాగంలో కోవిడ్ వార్డు ఆవరణలో ఫిమేల్ మెడికల్ వార్డులు ఉన్నాయి. అక్కడ మహిళా రోగులు ఉన్నచోట కోవిడ్ వార్డును ఎలా ఏర్పాటు చేస్తారని బంధువులు మండిపడుతున్నారు. రెండు రోజులుగా కోవిడ్ రోగిని అటు ఇటు తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు స్పందించి ప్రత్యేక కోవిడ్ వార్డును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.
వరంగల్ నగరంలో ఒకే రోజు ఏడు కోవిడ్ కేసులు..
వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు స్పందించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళనలకు గురి కానవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు..
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!