బహ్రెయిన్ లో అత్యవసర పరిస్థితులు..33 షెల్టర్లు రెడీ.. వార్నింగ్ సైరన్ల పరిశీలన..!!

- June 17, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో అత్యవసర పరిస్థితులు..33 షెల్టర్లు రెడీ.. వార్నింగ్ సైరన్ల పరిశీలన..!!

మనామా: ఇజ్రాయెల్ - ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు బహ్రెయిన్‌లోని అధికారులు దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్ల పరీక్షను నిర్వహించారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఇది ఒక సాధారణ ప్రక్రియ అని అధికారులు తెలిపారు.  

బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరిక వ్యవస్థల సంసిద్ధతను అంచనా వేశారు. అత్యవసర హెచ్చరిక వ్యవస్థ కవరేజ్ బహ్రెయిన్ వ్యాప్తంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.  మరోవైపు ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా, పౌర అత్యవసర పరిస్థితులపై సంసిద్ధతకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను బహ్రెయిన్ క్యాబినెట్ సమీక్షించింది.

రక్షణ చర్యలు

బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక రక్షణ చర్యలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. నేషనల్ సివిల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ ను పూర్తిగా యాక్టివేట్ చేశారు. ప్రజా భద్రత తమ ప్రాధాన్యం అని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.  బహ్రెయిన్‌ వ్యాప్తంగా మొత్తం 33 షెల్టర్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. విమాన సర్వీసుల సస్పెన్షన్లు, రద్దుల కారణంగా విదేశాలలో చిక్కుకున్న పౌరులను స్వదేశానికి రప్పించడానికి అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక రేడియేషన్ స్థాయిలకు సంబంధించి  ప్రజలను, పర్యావరణాన్ని రక్షించడానికి త్వరిత ప్రతిస్పందన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ అణు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర నష్టాన్ని కలిగించింది. జూన్ 14న ఇస్ఫహాన్‌లో ఆఫ్-సైట్ రేడియేషన్ స్థాయిలు మారలేదని ఇరాన్ అణు నియంత్రణ సంస్థ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు తెలియజేసింది. నిపుణులు ఇప్పటివరకు ఇరానియన్ అణు సౌకర్యాలకు పరిమిత నష్టాన్ని మాత్రమే నివేదించారు.

తగినన్ని వస్తువులు

ప్రస్తుత అవసరాలను తీర్చడానికి అవసరమైన వస్తువులు,  ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని బహ్రెయిన్ అధికారులు ప్రకటించారు. దేశంలోకి అవసరమైన వస్తువుల దిగుమతి నిరాంతరాయంగా సాగుతుందని తెలిపారు.  స్థానిక మార్కెట్లలో అన్ని అవసరాలను తీర్చడానికి తగినంత మందులు ఉన్నాయని,  బహ్రెయిన్ అంతటా వైద్య బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి స్థిరంగా ఉందని, అత్యవసర పరిస్థితులలో నిరంతర సరఫరాను కొనసాగించడానికి అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తోడు రక్షిత తాగునీరు అంతరాయం లేకుండా సరఫరా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com