భాషా వాఙ్మయకర్త-తిరుమల రామచంద్ర
- June 17, 2025
భాషావేత్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడుగా, పత్రికా రచయితగా, వ్యాసకర్తగా, పండితుడుగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, బహుభాషా కోవిదుడుగా తిరుమల రామచంద్ర ఎనలేని పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇరవయ్యో శతాబ్ది తెలుగు విద్వత్ జగత్తులో ఆయన అద్వితీయుడు. భాష, వ్యాకరణం, సాహిత్యం, లిపి విజ్ఞానం, సంస్కృతి వికాసం, తులనాత్మక భాషా శాస్త్రం లాంటి అనేక అంశాల్లో అసాధారణ ప్రతిభాశాలి. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
తిరుమల రామచంద్ర 1913 జూన్ 17న అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా తాడిపత్రి దగ్గర రాంగపల్లె అనే అగ్రహార గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించారు. జానకమ్మ, శేషాచార్యులు వీరి తల్లిదండ్రులు. తన మాతామహునికి ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు అనీ అంతపెద్ద కుటుంబంలో మొట్టమొదట కలిగిన మగ సంతానం తానేననీ, అందువల్ల మాతామహుల ఇంట్లో అల్లారు ముద్దుగా శైశవం గడిచిందనీ తిరుమలవారు చెప్పారు. వారికి నాలుగేళ్ళు నిండే వరకు తల్లి దగ్గరే ఆమె పుట్టింట్లోనే వున్నారు, ఐదో ఏడు వచ్చిన తర్వాత కమలాపురం వెళ్లి అక్కడే తన ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించారు.
తిరుపతి సంస్కృతి కళాశాలలో ఆయన ఎనిమిదేళ్ళు చదువుకున్నారు. నెల్లూరు సంస్కృత కళాశాలలో కూడా చదివారు.విద్యార్థి దశలోనే సత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు, తిరుచినాపల్లి జైళ్ళలో వున్నారు. సహాయ నిరాకరణ సభలకు సంస్కృతంలో ‘మార్చింగ్ సాంగ్స్' రాశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమస్తాగా అఫ్ఘానిస్తాన్– బెలూచిస్తాన్ సరిహద్దులో పనిచేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సభల్లో పాల్గొన్నారు.స్వాతంత్య్ర సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా జైలు అనుభవించారు. సంస్కృతంలో ‘సాహిత్య శిరోమణి’ తెలుగు సంస్కృత భాషల్లో ‘విద్వాన్’, హిందీలో ‘ప్రభాకర్’ లాంటి డిగ్రీల్ని వీరు పొందారు.
1934లో మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో కాపీయిస్టుగా ఉద్యోగం ప్రారంభించారు. వీరి జీవితంలో పెద్ద మలుపు ఇక్కడే జరిగింది. ప్రముఖ విమర్శకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారితో పరిచయం కలిగింది. తాను ప్రభాకరశాస్త్రి గారికి ఏకలవ్యశిష్యుడను అని చెప్పుకున్నారు కూడా. తర్వాత తంజావూరు సరస్వతీ మహాలు (1933-–38)లో పండితుడుగా పని చేశారు. అక్కడ మానవల్లి రామకృష్ణకవితో పరిచయం అయింది. పిదప లాహోరు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీలో పండితుడుగా చేరారు. 1939 మే 7వ తేదిన అనంతలక్ష్మితో వివాహం అయింది. ఆయనకు నీరజ, ఆముక్తమాల్యద, శేషశాయి ముగ్గురు పిల్లలు.
ఢిల్లీలో ‘డెయిలీ టెలిగ్రాఫ్’ ఆంగ్ల పత్రికలో పని చేశారు. అడివి బాపిరాజుగారి సంపాదకత్వంలో వచ్చిన ‘మీజాన్’ (1944–-47) పత్రికలో బాధ్యతలు చేపట్టారు. రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బారావు, విద్వాన్ విశ్వం, శ్రీనివాస చక్రవర్తి, మున్నగు వారితో ఆ పత్రికలో పనిచేశారు. భారతి, ఆంధ్రప్రభ (1947–-59), ఆంధ్రపత్రిక (1960-–71), ఆంధ్రభూమి (1975-–79), పత్రికల్లో వివిధ స్థాయిల్లో, హోదాల్లో పని చేశారు. తిమ్మావఝ్ఝల కోదండరామయ్యతో కలిసి ‘పరిశోధన’ అనే పత్రికను నడిపారు. ఇది మద్రాసు నుండి ద్విమాస పత్రికగా వచ్చింది. తిరుమల వారు పరిశోధక్, పరిశీలక్, తాతాచార్య, జిజ్ఞాసువు, ప్రయాణికుడు, ప్రేక్షకుడు లాంటి కలం పేర్లతో అనేక మంచి వ్యాసాలు రాశారు.
తిరుమల వారికి తెలుగుదేశంలో ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రంథాలు ‘మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు’, ‘నుడి–-నానుడి’, ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’, ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’ మొదలైనవి. ‘మన లిపి- పుట్టు పూర్వోత్తరాలు’ రచన చాలా గొప్పది. లిపి పరిణామాన్ని గూర్చి ఇందులో వివరించారు. ఇతర భాషల్లో ఇలాంటి రచన లేదని తాపీ ధర్మారావుగారు, రామచంద్ర గారిని అభినందించారు. అందరికీ అర్ధమయ్యే రీతిలో వీరు ఈ గ్రంథం రాశారు. రెండు వేల సంవత్సరాల్లో లిపి పరిణామక్రమాన్ని చాలా విపులంగా రాసిన ఈ గ్రంథం 1950లో ప్రచురితమయింది. ‘నుడి–-నానుడి’(1963) అనే గ్రంథం శబ్ద వ్యుత్పత్తికి సంబంధించింది. ఇందులో తిరుమల వారు నుడికారాల పుట్టుపూర్వోత్తరాల్ని, సామెతల్ని, ఇలా ఎన్నో అంశాల్ని నిశితంగా పరిశీలించారు.
‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ గ్రంథం 1978లో వచ్చింది. తిరుమల వారికి సంస్కృత, ప్రాకృత భాషల్లో మంచి ప్రావీణ్యముందని చెప్పడానికి ఈ గ్రంథం నిదర్శనం. ఇందులో 150 మూలగాథల్ని ప్రాకృతంలోనివి ఇచ్చి, వాటి అర్థ తాత్పర్యాలు కూర్చారు. 1986లో ఈ గ్రంథం రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. ‘గాథాసప్తశతి’లో ఏయే సందర్భాల్లో ఏయే అర్థాల్లో తెలుగు పదాలు కనబడతాయో వివరించారు. ‘సాహితీ సుగతుని స్వగతం’ (1969)లోని వ్యాసాలు ‘భారతి’ మాస పత్రికలో వచ్చాయి. ఈ వ్యాసాలు తిరుమల వారి పరిశోధనా ప్రతిభకు నిదర్శనాలు. ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలపై విశ్లేషణాత్మక వివరణ ఇందులో వుంది.
1971లో ఈ గ్రంథానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉత్తమ సాహిత్య విమర్శ బహుమతి లభించింది. ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’ గ్రంథంలో పత్రికల ఆవిర్భావ వికాసాల్ని గూర్చి అద్భుతంగా రాశారు. దిన, వార, మాసపత్రికల్లో సాహిత్య సేవ గూర్చి విపులంగా వివరించారు. పత్రికా రంగానికి సంబంధించి ఈ గ్రంథం చాలా ప్రామాణికమైంది. తిరుమల రామచంద్ర ‘మూడు వాఙ్మయ శిఖరాలు’ (1987) అనే గ్రంథం చాలా విలువైంది. భాషా, సాహిత్య విమర్శ రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు మహనీయులు గూర్చి ఆయన ఈ పుస్తకంలో వివరించారు. ఆ ముగ్గురు మహనీయులు: మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు.
‘అవదాన కల్పలత’ క్షేమేంద్రుడి రచనకు అనువాదం. గౌతమబుద్ధుని పూర్వజన్మలకు సంబందించిన జాతక కథలివి. మహాయన బౌద్ధులు తథాగతుడి దివ్యచరిత్రను గూర్చి రాసిన గ్రంథం ‘లలిత విస్తరం’. బులుసు వేంకట రమణయ్య గారితో కలసి ఈ గ్రంథాన్ని తిరుమల వారు రాశారు. ఇది 1972లో వెలువడింది. హాలుడి ‘గాథా సప్తశతి’ నుంచి ఏభై కథల్ని తీసుకొని ‘హాలుని గాథలు’గా రాశారు. ‘మనవిమాటలు’, ‘అహంభో అభివాదయే’, ‘బృహదా రణ్యం’ అనే వ్యాస సంపుటాలు వెలువడ్డాయి.
వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన మహనీయుల జీవితరేఖల్ని ‘మరపురాని మనీషి’ శీర్షికతో ‘ఆంధ్ర ప్రభ’ సచిత్ర వారపత్రికలో వ్యాసాలు రాశారు. విభిన్న రంగాలకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తుల్ని పరిచయం చేయడంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు తిరుమలవారు. ‘ఆంధ్రపత్రిక’లో ‘తెలుగు వెలుగులు’ అనే శీర్షికను రామచంద్ర నిర్వహించారు. ప్రతిభావంతులైన అనేకమంది వ్యక్తుల్ని గూర్చి ఈ శీర్షికలో మంచి వ్యాసాలు రాశారు.
‘హంపీ నుంచి హరప్పా దాక’ అనేది రామచంద్రగారి ‘స్వీయ చరిత్ర’. ఇందులో ఆయన ముప్పై సంవత్సరాల వయస్సు వరకు సంభవించిన జీవితవిశేషాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. స్వీయ జీవితోదంతాల్లో మూడో వంతు మాత్రమే చెప్పగలిగానని తిరుమల వారే చెప్పారు. రామచంద్ర గారి చివరి గ్రంథం ఇది. రామచంద్ర భాషా సాహిత్య సేవల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు. రామచంద్రగారు తెలుగు భాషా సాహిత్యాలకూ, పత్రికా రంగానికీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఆయన 1997 అక్టోబర్ 12న తన 84వ ఏట కీర్తిశేషులయ్యారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా