ప్రభుత్వ సలహాదారు మరియు APNRTS అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డా.రవికుమార్
- June 28, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులుగా డా.వేమూరు రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు వాళ్లు ఎక్కడున్నా నంబర్ వన్ గా ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యామనికి అనుగుణంగా, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తాము పనిచేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామని.., ఉద్యోగస్తులుగా ఉన్న ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. దీంతో పాటు విదేశాల్లో ఉన్న మన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా మెరుగైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రముఖ సంస్థల్లో అత్యున్నతస్థానాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన విద్యార్థులకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తామన్నారు.ఇందుకోసం మంత్రి నారా లోకేష్ గారి దిశానిర్దేశం మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో అవసరమైన శిక్షణా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు..మన తెలుగు విద్యార్థులు విదేశాల్లో ఉగ్యోగాలు సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు.ఇందుకోసం వివిధ దేశాల్లోని మన రాష్ట్ర ప్రభుత్వ కో-ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని డా.వేమూరు రవి కుమార్ తెలిపారు.
మన ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కార్యకలాపాలు మెరుగయ్యేలా ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ తగినవిధంగా పనిచేస్తుందని దీని వల్ల మరింత మందిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దే అవకాశముంటుందని డా. వేమూరు రవికుమార్ అన్నారు. ఇందుకోసం ఏపీ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహకారం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎన్నారైగా మంత్రిగారి అనుభవం సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని డా.రవి కుమార్ అభిప్రాయపడ్డారు.అలాగే సీఈవో హేమలత రాణి గారి అనుభవం కూడా సొసైటీ అధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
మంత్రి నారా లోకేష్ గారి సలహా మేరకు రాష్ట్రంలో ఎన్నారైల పెట్టుబడులను మరింత పెంచేందుకు కృషి చేస్తామని..ఇందు కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఒక వేదికగా పనిచేస్తుందని డా.వేమూరు రవికుమార్ వివరించారు.అంతేకాకుండా ఎన్నారైలకు భరోసాగా ఉండేందుకు ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్యాకెజీలను అందుబాటులోకి తీసుకొచ్చి..ఎన్నారైలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుందన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యాలను విదేశాల్లోనూ ప్రోత్సహించడంతో పాటు ఆయా దేశాల్లో శ్రీవారి కల్యాణం, బెజవాడ దుర్గమ్మ పూజలు, శ్రీశైలం మల్లన్న అభిషేకాలను కూడా నిర్వహించే ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఎన్నారైల భాగస్వామ్యంతో రూ.950 కోట్లతో నిర్మించనున్న ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని డా.వేమూరు రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన డా.వేమూరు రవి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.ఎన్నారై వ్యవహారాలపై మంచి పట్టున్న వేమూరు రవికుమార్ గారు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నక్కా ఆనందబాబు,ఇంటూరి నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, ఏపీస్ఎస్డీసీ ఎండీ గణేష్ కుమార్,ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో హేమలత రాణి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి, శాంతి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు రాధాకృష్ణ రవి, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్నారై మురళీ రాపాకతో పాటు పలువురు ఎన్నారైలు, మరియు నాయకులు పాల్గొన్నారు.
--
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







