తిరుమలకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు

- June 29, 2025 , by Maagulf
తిరుమలకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు

తిరుమల: పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని గణనీయంగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా వాయు,శబ్ద కాలుష్యానికి గురయ్యే పుణ్యక్షేత్రాలలో ఇవి ఎంతో అవసరమనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, తిరుమల-తిరుపతి మధ్య ప్రయాణించే వాహనాల పరంగా ఎలక్ట్రిక్ బస్సులకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే తిరుమలలో 50 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.ఇవి కనుమదారుల్లో తిరుగుతున్నాయి.వీటితో పాటు మరో 300 ఎలక్ట్రిక్ బస్సు లు తిరుమలకు రానున్నాయి.పలు విడతల్లో ఈ 300 బస్సులు తిరుమలకు చేరుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే 750 విద్యుత్తు బస్సులు కేటాయించింది. వీటిల్లోంచి 50 బస్సులను ‘తిరుమల- తిరుపతి’కి కేటాయించారు.

ఇవికాక మరో 300 విద్యుత్ బస్సులను తిరుమలకు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు.దీనికి సానుకూల స్పందన వచ్చింది.దీనిలో భాగంగా తొలి దశలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే 50 బస్సులను మంగళం డిపోకు కేటాయించనున్నారు. అలానే భవిష్యత్తులో తిరుమలకు రానున్న 300 బస్సుల్లో 150 బస్సులను తిరుమల డిపోనకు, అలిపిరి డిపోకి 50, తిరుపతిలో నిర్మించే కొత బస్ డిపోకు 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు. శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య మరో 50 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

తిరుమలకు భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తుండటంతో, సుమారు 150 బస్సులకు అవసరమైన ఛార్జింగ్‌ స్టేషన్లు, ఇతర సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐదెకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. అలానే తిరుమలలో విద్యుత్తు బస్సులకు అవసరమైన ప్రత్యేక డిపో కోసం స్థల పరిశీలన కూడా పూర్తి చేసినట్లు జిల్లా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.అలానే త్వరలోనే 50 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్న మంగళం డిపోలో ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు వచ్చాయని, బస్సులు వచ్చేలోగా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com