తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు

- June 29, 2025 , by Maagulf
తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుపతి: తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రంలో శ్రీ వారాహీ నవరాత్రులు సందర్భముగా శ్రీ శ్రీ శ్రీ అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు  ఆదివారం దర్శించుకున్నారు. 

అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు. 

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. 

ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే  విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్మన్ చెప్పారు. 

ప్రస్తుతం టిటిడి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు. 

ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు.శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసాదాన్ని ఛైర్మన్ కు అందించారు.అనంతరం స్వామి, అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com