టాలీవుడ్ సుడిగాడు-అల్లరి న‌రేశ్

- June 30, 2025 , by Maagulf
టాలీవుడ్ సుడిగాడు-అల్లరి న‌రేశ్

మొద‌ట్లో పెన్నూ, పేప‌ర్ ప‌ట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్ష‌న్ చేయాలి అంటూ ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ చిన్న కొడుకైన అల్లరి న‌రేశ్ ఆరాట‌ప‌డేవాడు. అయితే అప్ప‌టికే తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఒక‌ట్రెండు సినిమాల్లో బాల‌న‌టునిగా ద‌ర్శ‌న‌మిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం త‌న పెద్ద‌కొడుకు రాజేశ్ ను హీరోని చేయాల‌ని ఆశించారు. కానీ, తొలుత తెర‌పై క‌నిపించిన న‌రేశ్ నే న‌ట‌న ఆవ‌హించింది. న‌టునిగా స‌క్సెస్ ద‌రి చేరింది. ఈ త‌రం హీరోల్లో అతివేగంగా యాభై చిత్రాలు పూర్తి చేసిన హీరోగా న‌రేశ్ రికార్డ్ సృష్టించాడు. నేడు టాలీవుడ్ సుడిగాడు అల్లరి న‌రేశ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

అల్లరి నరేశ్ అలియాస్ ఈదర నరేష్1982 జూన్ 30న ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ, సరస్వతి కుమారి దంపతులకు జన్మించాడు. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్ లో విద్యనభ్యసించిన నరేశ్ తండ్రి హైదరాబాద్ మకాం మార్చగానే ఆయన పనిచేసే చిత్రాలను అధ్యయనం చేయసాగాడు. అలాగే పాశ్చాత్య చిత్రాలను సైతం పరిశీలించి, దర్శకత్వంపై మక్కువ పెంచుకున్నాడు నరేశ్. అన్న రాజేశ్ ను తండ్రి ‘హాయ్’ సినిమాతో హీరోని చేశారు. తాను దర్శకుడినవుతానని చెప్పుకొనేవాడు నరేశ్. అదే సమయంలో ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు మెగాఫోన్ పట్టి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. తన సినిమాలో హీరోకి కావలసిన అన్ని లక్షణాలూ నరేశ్ లో ఉన్నాయని భావించిన రవిబాబు తన ‘అల్లరి’లో అతడినే హీరోగా ఎంచుకున్నాడు. తొలి సినిమానే మంచి విజయం సాధించడం, అప్పటికే ఓ నరేశ్ చిత్రసీమలో ఉండడంతో ఇతను ‘అల్లరి’ నరేశ్ గా నిలచిపోయాడు.

తొలి చిత్రం అల్ల‌రితోనే న‌రేశ్ త‌న‌దైన బాణీ ప‌లికించ‌డంతో అవ‌కాశాలు అత‌ణ్ణి వెదుక్కుంటూ వచ్చాయి. అల్ల‌రోడుగా జ‌నం మ‌దిని గెలిచాడు. తొట్టిగ్యాంగ్తో న‌వ్వుల పువ్వులు పూయించిన న‌రేశ్ ప్రాణం పెట్టి ప్రేమ‌క‌థలోనూ న‌టించాడు. నేనులో న‌టునిగా మంచి మార్కులు కొట్టేశాడు. నువ్వంటే నాకిష్టంలోనూ న‌టునిగా మ‌రోమెట్టు పైకి ఎక్కాడు. అయితే న‌రేశ్ చేసే అల్ల‌రినే జ‌నం మెచ్చారు. అందుకే న‌వ్వులు పూయిస్తూనే స‌ర‌దాగా స‌క్సెస్ రూటులో సాగిపోయాడు. ఈ మ‌ధ్య వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ నాంది ప‌లికాడు. అంత‌కు ముందు న‌వ్వుల‌తోనే ఆక‌ట్టుకున్న న‌రేశ్, నాందితో మ‌రో కోణం చూపించాడు. దానిని జ‌నం సైతం ఆమోదించారు. అంటే ఇక ముందు న‌రేశ్ ను వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో చూడ‌వ‌చ్చున‌నే భ‌రోసా క‌లుగుతోంది.

న‌రేశ్ రూపురేఖ‌లు ఆరంభంలో కార్టూన్ ను త‌ల‌పించాయి. అందుకే అత‌ని న‌ట‌న న‌వ్వులు పూయించింది. పేరున్న కామెడీ డైరెక్ట‌ర్లు అంద‌రూ న‌రేశ్ తో చిత్రాలు తీసి అల‌రించారు. ఇక తండ్రి ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలోనూ న‌రేశ్ పండించిన న‌వ్వులు త‌క్కువేమీ కావు. కిత‌కిత‌లు, అత్తిలి స‌త్తిబాబు ఎల్.కే.జి, అల్ల‌రే అల్ల‌రి, సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్, గ‌మ్యం, బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి, బ్లేడ్ బాబ్జీ, సిద్ధూ ఫ్ర‌మ్ శ్రీ‌కాకుళం, క‌త్తికాంతారావు, అహ నా పెళ్ళంట‌, య‌ముడికి మొగుడు, యాక్ష‌న్ 3డి, సుడిగాడు వంటి చిత్రాలతో ఆక‌ట్టుకున్న న‌రేశ్ ను త‌రువాత ప‌రాజ‌యాలు ప‌ల‌కరించాయి. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్ తో క‌ల‌సి మ‌హ‌ర్షిలో ర‌విగా న‌టించి మంచి మార్కులు సంపాదించాడు.

తెలుగు చిత్రాలలో నటిస్తూనే ‘కురుంబు’ అనే తమిళ సినిమాలోనూ నటించాడు నరేశ్. బంగారుబుల్లోడు చిత్రంతో మ‌ళ్ళీ కామెడీ ట‌చ్ ఇచ్చాడు. అయితే మునుప‌టి స్థాయిలో స‌క్సెస్ ద‌రి చేర‌లేదు. అప్పుడే నాంది న‌రేశ్ ద‌గ్గ‌ర‌కు న‌డ‌చుకుంటూ వ‌చ్చింది. త‌న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్న నాందిలో న‌టించి మెప్పించాడు న‌రేశ్. ఆరంభంలో ఈ సినిమాకు మంచి టాక్ ఉన్నా వ‌సూళ్ళు రాల‌లేదు. కానీ, మౌత్ టాక్ తో నాంది నరేశ్ కు అనూహ్య‌మైన విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో అలాంటి వైవిధ్య‌మైన పాత్ర‌లే ఇక‌పై న‌రేశ్ ను ప‌ల‌క‌రిస్తూ వచ్చాయి. నాంది తర్వాత ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, బచ్చల మల్లి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఏది ఏమైనా న‌టునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న న‌రేశ్ రాబోయే రోజుల్లో విల‌క్ష‌ణ‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంటారేమో చూడాలి.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com