వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

- June 30, 2025 , by Maagulf
వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల: వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సోమవారం వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈవో  వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవ ద్వారా టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

సాంకేతిక విభాగాల్లో కూడా సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి విభాగంలో అవసరాన్ని బట్టి శ్రీవారి సేవ ద్వారా వారి సేవలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకుని టీటీడీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. కార్య నిర్వాహక ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా స్థానిక అనుమతులు తీసుకోవాలన్నారు.

ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ధిష్ట ప్రక్రియా విధానాన్ని రూపొందించి సుస్థిర వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, సీఈ సత్య నారాయణ, ఐటీ జీఎం శేషారెడ్డి, హెచ్ డీపీపీ సెక్రటరీ రఘురామ్, డిప్యూటీ ఈవో రాజేంద్ర,  సోమన్నారాయణ, సీఎండీ నర్మదా, డీఈవో వెంకట సునీలు, డీసీఎఫ్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com