మలేసియా డిటెన్షన్ సెంటర్ లో చావు బతుకుల్లో జగిత్యాల యువకుడు

- July 14, 2015 , by Maagulf
మలేసియా డిటెన్షన్ సెంటర్ లో చావు బతుకుల్లో జగిత్యాల యువకుడు

మలేసియా డిటెన్షన్ సెంటర్ లో చావు బతుకుల్లో ఉన్న కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణం విద్యానగర్ కు చెందిన ఆలకుంట కొమరయ్య అనే ప్రవాసి కార్మికున్ని రక్షించి స్వదేశానికి రప్పించాలని అతని భార్య విజయ జిల్లా కలెక్టరుకు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 'మదద్' ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ విషయాన్నిమలేసియాలోని ఇండియన్ హై కమీషనర్ కు, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖల దృష్టికి తీసికెళ్లారు. 

రెండేళ్ళ క్రితం విజిట్ వీసాపై మలేసియాకు వెళ్ళిన కొమరయ్య వీసా కాలపరిమితి ముగిసి అక్రమనివాసిగా మారాడు. 26 జనవరి 2015న పోలీసులు అరెస్టు చేయగా, వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు కోర్టు 60 రోజుల జైలు శిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తి అయి స్వదేశానికి వెళ్ళడానికి విమాన ప్రయాణ టికెట్టు కొనుగోలు చేసుకోనందున ఇతన్ని జైలు నుండి మలక్కా రాష్ట్రం 'అలోర్ గజా' జిల్లా ఇల్లీగల్ ఇమిగ్రంట్స్ డిటెన్షన్ సెంటర్ కు బదిలీ చేశారు. కొమరయ్య భారత్ కు తిరిగి రావడం కోసం అతని భార్య విజయ రూ.10 వేల విలువచేసే విమాన ప్రయాణ టికెట్టును కొనుగోలుచేసి జూన్ 2న పంపించినా ఫలితం లేకుండా పోయింది. 

కొమరయ్యతో పాటు డిటెన్షన్ సెంటర్ లో ఉన్న కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం కొత్తపేటకు చెందిన నవీన్ ఇటీవలే స్వగ్రామానికి చేరాడు. ఇతని కథనం ప్రకారం విమాన ప్రయాణ టికెట్టు లేదనే కారణంతో కొమరయ్య 60 రోజుల శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా అదనంగా 100 రోజులకు పైగా డిటెన్షన్ సెంటర్ లో మగ్గుతున్నాడు, ఆరోగ్యం క్షీణించి చావు బతుకుల్లో ఉన్నాడు. 10 మంది ఉండాల్సిన గదిలో 30 మందిని కుక్కి ఉంచుతున్నారని, ఉడికీ ఉడకని అన్నం పెడతారని, సబ్బు, పేస్ట్ ఇవ్వరని ఆయన తెలిపారు. చాలా మంది కాళ్ళకు, చేతులకు పుండ్లు అయి ఇన్ఫెక్షన్ వచ్చిందని, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవని, బాత్రూం నీళ్ళే గతి అని ఆయన అన్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ లో నిజామాబాద్ జిల్లా జానకంపేట్ కు చెందిన అమీర్ ఖాన్, బాల్కొండకు చెందిన హన్మంత రావ్ కూడా ఉన్నారని నవీన్ తెలిపారు. 

మలేసియా జైళ్లలో 244 మంది శిక్ష పడ్డ ఖైదీలు ఉన్నారని, ఇందులో ఒకరు జైల్లోనే చనిపోయారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శిక్షా కాలం పూర్తయినా ఫ్లయిట్ టికెట్ లేని కారణంగా, పాస్ పోర్టులు లేని వారికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు (తాత్కాలిక పాస్ పోర్ట్) జారీ కానందున వందలాది మంది భారతీయులు మలేసియా జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో మగ్గుతున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని ఇండియన్ హైకమీషన్ నిర్లక్ష్య వైఖరికి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలసత్వానికి ఇది పరాకాష్ట.  

 

'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com