బహ్రెయిన్‌లో కేరళ ఫ్యామిలీకి తొలగిన 18 ఏళ్ల కష్టాలు.. గౌరవంగా భారత్ కు..!!

- July 12, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో కేరళ ఫ్యామిలీకి తొలగిన 18 ఏళ్ల కష్టాలు.. గౌరవంగా భారత్ కు..!!

మనామా: బహ్రెయిన్‌లో 18 సంవత్సరాలకు పైగా బాధాకరమైన జీవితం గడిపిన తర్వాత, మిస్టర్ అష్రఫ్, అతని భార్య రాంషీదా, వారి ఇద్దరు కుమార్తెలు చివరకు ఇండియాకు బయలుదేరారు. వివరాల్లోకి వెళితే..  కేరళకు అష్రఫ్ కుటుంబం రిఫాలోని ఒక చిన్న అద్దె గదిలో ఇన్నాళ్లు జీవించారు. సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో నిరంతరం భయంభయంగా గడిపారు. మెరుగైన జీవితం కోసం బహ్రెయిన్ లో అడుగుపెట్టిన అష్రఫ్ కలలను..ముగిసిన వీసాలు పీడకలగా మార్చాయి. అతని భార్య 2013 నుండి, అతని పెద్ద కుమార్తె 2012 నుండి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడే ఉంటున్నారు. ఇక బహ్రెయిన్‌లో జన్మించిన చిన్న కుమార్తె అరాఫా ఫాతిమాకు చట్టపరమైన గుర్తింపు(పాస్‌పోర్ట్ , CPR , జనన నమోదు) లేకపోవడం వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసింది.

చదువు, వైద్య సంరక్షణకు దూరం
ఈ దారుణ పరిస్థితిలో అష్రఫ్ పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోయారు. కుటుంబం చట్టబద్ధంగా ఏ పని చేయలేకపోయింది.  ప్రాథమిక వైద్య సంరక్షణ పొందడం కూడా కష్టమైంది.  అష్రఫ్‌కు కిడ్నీ వైఫల్యం కారణంగా డయాలసిస్ చేయించుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆదాయం లేదా చట్టపరమైన గుర్తింపు లేకుండా, అటువంటి క్లిష్టమైన చికిత్సను పొందడం బహ్రెయిన్ లో అసాధ్యంగా అనిపించింది. అదే సమయంలో గ్లోబల్ PRO , బహ్రెయిన్ చాప్టర్ ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్.. వారి దుస్థితి గురించి తెలుసుకుని వారిలో ధైర్యాన్ని నింపారు. PLC పాలక మండలి సభ్యుల మద్దతుతో అష్రఫ్ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించారు. అష్రఫ్‌ను కాథెటర్ సర్జరీ కోసం సల్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకబ్ థామస్ మద్దతుతో డయాలసిస్ సెషన్‌లను KIMSHEALTH (GCC)లో నామమాత్రపు ఖర్చుతో ఏర్పాటు చేశారు. PLC ఆసుపత్రి సమన్వయంతో మందులు, ఆహారం, అద్దె, వారి వివాహ ధృవీకరణ పత్రం వంటి అన్ని లాజిస్టికల్, పర్సనల్ మద్దతును బాధ్యతగా అందజేసి ఆదుకున్నారు.

అదే పెద్ద అడ్డంకి
బహ్రెయిన్‌లో జన్మించిన కుమార్తె అరాఫా ఫాతిమా చట్టబద్ధత అనేది అతిపెద్ద అడ్డంకి మారింది.  పిఎల్‌సి తన జనన ధృవీకరణ పత్రాన్ని పొందడానికి కేసు దాఖలు చేయడానికి అడ్వకేట్ తారిక్ అలోన్ కోసం పవర్ ఆఫ్ అటార్నీని ఏర్పాటు చేసింది. కోర్టు అరాఫా జననాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో 13 సంవత్సరాలలో మొదటిసారిగా ఆమెకు చట్టపరమైన గుర్తింపు లభించింది. పాస్‌పోర్ట్ ఇప్పించారు. ప్రయత్నాలు ఫలించడంతో నలుగురు కుటుంబ సభ్యులకు అవుట్‌పాస్‌లు (అత్యవసర సర్టిఫికెట్లు) జారీ అయ్యాయి. 

జరిమానాలు
గత 13 సంవత్సరాలలో ఇమ్మిగ్రేషన్ జరిమానాలు, కుటుంబానికి అధిగమించలేని మొత్తంగా మారి చివరి ప్రధాన అడ్డంకిగా నిలిచాయి. PLC బృందం బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించింది.  వారు సానుభూతితో స్పందించారు. కుటుంబం రెసిడెన్సీని చట్టబద్ధం చేయడంలో సహాయపడి, వారు తమ స్వదేశానికి బయలుదేరడానికి అనుమతించారు.

ఇక బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తరఫున వినోద్ కె. జాకబ్, మొదటి కార్యదర్శి రవి జైన్, రెండవ కార్యదర్శి రవి సింగ్ చొరవతో ఎయిర్ ఇండియా ద్వారా కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఎట్టకేలకు దాదాపు 13 ఏళ్ల తర్వాత అష్రఫ్ కుటుంబం విమానం ఎక్కి, గౌరవంతో భారత్ లో అడుగుపెట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com