ఏపీలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
- August 11, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను సమర్థవంతంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా జరిగే సరకు రవాణాను ఈ కొత్త కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై దృష్టి రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులు, పోర్టుల అభివృద్ధి, మారిటైమ్ పాలసీలో తీసుకురావాల్సిన మార్పులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి పోర్టు, ఎయిర్‌పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెంది, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తద్వారా సంపద సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా సమీకృత అభివృద్ధి కోసం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వద్ద నేషనల్ హైవేలు, రైల్వేల కోసం నిధుల కొరత లేదని చంద్రబాబు అన్నారు. ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపితే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. షిప్ బిల్డింగ్ యూనిట్లు, మత్స్యకారుల సంక్షేమం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్లు ఎన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయో చూడాలని సీఎం సూచించారు. పోర్టుల నిర్మాణం, షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ సమయంలో స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కంటైనర్ పోర్టుల ఏర్పాటు, అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వం నిర్వాకంతో కంటైనర్ పోర్టు తమిళనాడుకు తరలిపోయిన పరిస్థితులు మళ్లీ రాకూడదని సీఎం అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!