తొలిరోజు చెన్నైలో ఏకంగా 350 ప్రదర్శనలు

- July 17, 2016 , by Maagulf
తొలిరోజు చెన్నైలో ఏకంగా 350 ప్రదర్శనలు

సూపర్‌స్టార్‌ కథానాయకుడిగా 'వి' క్రియేషన్స్‌ బ్యానరుపై కలైపులి థాను నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కబాలి. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. తొలిరోజు చెన్నైలో ఏకంగా 350 ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అమెరికాలో తెలుగు, తమిళం, ఆంగ్లంతో పాటు నాలుగు భాషల్లో సినిమాను ప్రదర్శించనున్నారు. ఒక సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయడం కూడా అక్కడ ఓ రికార్డేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలా అడుగడుగునా భారీ అంచనాలు, పలు ప్రత్యేకతలతో ఈ సినిమా విడుదలవుతోంది. అందుకు తగ్గట్టుగానే పైరసీ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాత థాను. అందులో భాగంగానే పైరసీకి చిరునామాగా మారిన పలు అనుమతిలేని వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు 225 వెబ్‌సైట్లను స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత థాను మాట్లాడుతూ ఇది కేవలం 'కబాలి' కోసం వేసిన పిటిషన్‌ కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమను ఈ పైరసీ మహమ్మారి తీవ్ర నష్టాల్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీపై తొలి ప్రయత్నంగా వెబ్‌సైట్లను స్తంభింపజేయడం కూడా ఓ విజయమేనని ఆయన అన్నారు. తమ సినిమా నెట్‌లో విడుదలైపోతుందేమో అని భయపడే నిర్మాతలకు ఇది తీపికబురని చెప్పారు. ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసిన న్యాయస్థానానికి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదలకు అన్నివిధాలా పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే టికెట్ల రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చెన్నైలోని థియేటర్లకు దాదాపు 10 రోజుల వరకు అప్పుడే రిజర్వేషన్‌ ముగిసినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com