ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం హామీ

- August 18, 2025 , by Maagulf
ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం హామీ

 న్యూఢిల్లీ: ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం రాత్రి విజయవాడ నుండి న్యూఢిల్లీ బయలుదేరిన మంత్రి కందుల దుర్గేష్ సోమవారం  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ అభివృద్ధికి సంబంధించి దాదాపు రూ.270 కోట్ల విలువైన మూడు పర్యాటక ప్రాజెక్టుల డీపీఆర్ లు సమర్పించారు. ప్రధానంగా లేపాక్షిలో కల్చరల్ సెంటర్, పర్యాటకుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.103 కోట్లు, లంబసింగిలో పర్యాటకులకు ఆహ్లాదకరమైన, అద్భుతమైన అనుభవాల కల్పనకు రూ.99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ సమీపంలో టెంట్ సిటీల ఏర్పాటుకు రూ.77.32 కోట్లు అవసరమవుతాయని సంబంధిత డీపీఆర్ లను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ సమర్పించారు. అదే విధంగా ప్రపంచ స్థాయి హోదా కల్పనలో భాగంగా యూనెస్కో జాబితాలో లేపాక్షికి గుర్తింపు అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకులకు మధురమైన అనుభవాలకు కల్పించేందుకు ఆంధ్ర కశ్మీర్ గా పేరొందిన లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్, బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తొట్లకొండ, నాగార్జున కొండ తదితర బుద్దిస్ట్ సర్క్యూట్ లలో టెంట్ సిటీలు, చారిత్రక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన లేపాక్షిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి సమర్పించినట్లు తెలిపారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల వసతి వ్యవధి పెరుగుతుందని, స్థానికంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. వీటన్నింటికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

లలిత కళలను ప్రోత్సహించేందుకు, యువ కళాకారులకు మద్దతుగా విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని అభ్యర్థించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.సాంస్కృతిక ప్రదర్శనలు చేసేందుకు విజయవాడలోని జీవీఆర్ మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం, రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగు భాష, సాహిత్యాన్ని, సంగీత, నృత్య, నాటక కళలను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు, రచయితలకు అవకాశాలు కల్పించేందుకు సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా అభ్యర్థించానన్నారు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును పునర్ముద్రించాలని, భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన అవసరాన్ని వివరించానని తెలిపారు.అదే విధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్ ల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలు, సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు,అంతర్జాతీయ పర్యాటక డెస్క్ లు, ప్రధాన పర్యాటక అగ్రిగేటర్లకు స్థలాలు, వీసా ఫెసిలిటేషన్ కౌంటర్లు ఏర్పాటు కోసం రూ.100 కోట్లతో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్ ప్రెటేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీటీఐఎఫ్ సీ) ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరానన్నారు. ఇప్పటికే ఈ విషయమై అమరావతిలో 5 ఎకరాల భూమికి సీఎం చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రికి మంత్రి దుర్గేష్ వివరించారు. పై అభ్యర్థలకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని రాష్ట్ర మంత్రి దుర్గేష్ కోరారు. 

భేటీలో భాగంగా రాజమహేంద్రవరం లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అమరావతిలో పర్యాటక భవన్ అంశం చర్చకు వచ్చిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అదేవిధంగా గతంలో సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని సంబంధిత పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంశాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రితో మంత్రి దుర్గేష్ చర్చించారు.

అనంతరం శాస్కి, స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ స్కీమ్ ల క్రింద ఏపీకి పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు మంత్రి దుర్గేష్ కేంద్రమంత్రి షెకావత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమద్దతు రాష్ట్ర పర్యాటకం పై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com