సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి..

- August 24, 2025 , by Maagulf
సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి..

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వాన్ని దాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చిరంజీవి కోటి రూపాయలు ఇచ్చారు.ఇందుకు సంబంధించిన చెక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిరు అందించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా చిరు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించడంతో ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

చిరు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం కార్యాలయంలోనే ఈ చెక్కును అందజేశారు.

తన సాయం ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసరాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఉపయోగపడుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరంజీవికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటారని అభినందించారు.

కాగా, ఇలాంటి విరాళాలు మరికొందరిని కూడా సహాయక చర్యలకు స్ఫూర్తినిస్తాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం చేస్తూ అనేక మందికి తోడ్పడ్డారు. తాజాగా, ఆయన చేసిన విరాళం ఆయనకు ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధతను మళ్లీ తెలియజేస్తోంది.

చిరంజీవి ఇటీవలే తన 70వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com