టోక్యో సదస్సులో ప్రధాని మోదీ...

- August 29, 2025 , by Maagulf
టోక్యో సదస్సులో ప్రధాని మోదీ...

టోక్యో: భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని జపాన్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టోక్యో లో ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని అన్నారు. పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌-జపాన్‌ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధిలో జపాన్‌ కీలక భాగస్వామి అని అన్నారు. ‘ప్రపంచం కేవలం భారతదేశాన్ని మాత్రమే చూడటం లేదు. భారత్‌పై ఆశలు పెట్టుకుంది. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ కీలక పాత్ర పోషించింది. మెట్రో రైళ్ల నుంచి సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు.. ఇలా అనేక రంగాల్లో తోడ్పాటు అందించింది. జపాన్‌ సంస్థలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్‌లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని వివరించారు. ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించారు. అణుశక్తి, గ్రీన్‌ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com