అమెరికాలో వీసాదారులకు కొత్త హెచ్చరికలు

- September 09, 2025 , by Maagulf
అమెరికాలో వీసాదారులకు కొత్త హెచ్చరికలు

అమెరికా: అమెరికాలో నివసిస్తున్న హెచ్1బీ, ఎఫ్1 వీసా హోల్డర్లకు ఇది కీలకమైన హెచ్చరికగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌టైమ్ పనులు లేదా అదనపు ఆదాయం సంపాదించే ప్రయత్నాలు చేస్తే, కఠిన చర్యలు తప్పవని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న పొరపాటు కూడా దేశ బహిష్కరణకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు చట్టబద్ధంగా వీసాలతో ఉన్న వారి చర్యలపైనా కంటేస్తోంది. రాయబార కార్యాలయాలు, ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారులు వీసాదారులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి వీసా కలిగి ఉన్నప్పటి ఉద్యోగాలపై వివరాలు అడుగుతున్నారు. చిన్న తప్పిదాలనుంచి పెద్ద ఉల్లంఘనల వరకూ వారి మొత్తం రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఈ నిఘా భాగంగా అమెరికా పన్నుల విభాగం (IRS) రికార్డులు కూడా పరిశీలనలో ఉన్నాయి. వీసాదారుల ఆదాయ వివరాలు, పన్ను చెల్లింపుల్లో లోపాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విభాగానికి అందజేస్తున్నారు. వీసాదారుల ఆర్థిక వ్యవహారాలపై ఉన్న ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.కేవలం ఆర్థిక వ్యవహారాలే కాదు, వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలపై కూడా అమెరికా అధికారులు కన్నేశారు. వారి ఆన్‌లైన్ ప్రవర్తన, వ్యాఖ్యలు, సంబంధాలను గమనించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద కంటెంట్ లేదా తప్పు ప్రవర్తన కూడా ఇబ్బందులు కలిగించవచ్చు.

ఇమిగ్రేషన్ నిపుణులు వీసాదారులకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. అనధికారిక పనులు చేయకూడదని, అదనపు ఆదాయం కోసం అనధికార మార్గాలను వాడకూడదని చెబుతున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. చట్టబద్ధంగా ఉండటం ద్వారానే దేశ బహిష్కరణ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వారు అంటున్నారు.ప్రస్తుతం ఈ నిబంధనలు పూర్తిగా అమల్లో లేకపోయినా, జాగ్రత్తలు తప్పనిసరి. వీసా నిబంధనలు కఠినతరం అవుతున్న ఈ సమయంలో అప్రమత్తంగా ఉండటం వీసాదారుల భవిష్యత్తుకు రక్షణగా మారుతుంది. ప్రతి చర్యలో చట్టపరమైన మార్గదర్శకాలను పాటించడం ద్వారా మాత్రమే అమెరికాలో సురక్షితంగా ఉండవచ్చని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com