బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- September 13, 2025
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నూతన అధ్యక్షుడి నియామకంపై క్రికెట్ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ పదవీ కాలం త్వరలో ముగియనున్న నేపధ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
బీసీసీఐలో అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వంటి కీలక పదవులు ప్రతీసారి చర్చనీయాంశాలుగా మారుతాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంది.రోజర్ బిన్నీ పదవి ముగియడంతో సహజంగానే ఆయన తర్వాతి వారసుడిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరో రెండు వారాల్లో బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా, ఎన్నికల ప్రక్రియ లేకుండానే ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని బీసీసీఐలోని పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల మద్దతు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే బీసీసీఐ నేతలు రాష్ట్ర సంఘాలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం లభిస్తోంది. అసోసియేషన్లు కూడా ఏకగ్రీవ నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి పేరును ఎటువంటి అంతర్గత విభేదాలు లేకుండా ప్రకటించే అవకాశం ఉంది.సెప్టెంబర్ 28న బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను భర్తీ చేయనుంది.
సౌరవ్ గంగూలీ అనంతరం 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ మూడేళ్ల పదవికాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా ఉన్నారు.బీసీసీఐ నయా అధ్యక్షుడి రేసులో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను సచిన్ కార్యాలయం ఖండించింది.బీసీసీఐలో ఏ పదవి చేపట్టేందుకు సచిన్ టెండూల్కర్ ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. సెప్టెంబర్ 28న బీసీసీఐ నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) తమ ప్రతినిధిగా హర్భజన్ సింగ్ను నామినేట్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
2022లో భజ్జీని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.ఒకవేళ హర్భజన్ సింగ్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైతే..సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత మరో వరల్డ్ కప్ విజేతకు ఈ అవకాశం వచ్చినట్లు అవుతుంది.హర్భజన్ సింగ్ టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచి జట్లలో సభ్యుడు.
హర్భజన్ సింగ్తో పాటు బీసీసీఐ అధ్యక్షుడి రేసులో మాజీ క్రికెటర్, 63 ఏళ్ల కిరణ్ మోరె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వెస్ట్ జోన్కు చెందిన వారికి ఈ సారి అధ్యక్షుడిగా అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కిరణ్ మోరె సౌరాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించాడు. 2019లో యూఏస్ క్రికెట్కు తాత్కలిక కోచ్గా, డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించాడు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం