దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు

- September 20, 2025 , by Maagulf
దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. మొత్తం 474 పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన 25 పార్టీలు ఉన్నాయి.గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈసీ ఈ ప్రక్షాళనను గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. గత ఆగస్టులో 334 పార్టీల రిజిస్ట్రేషన్లు రద్దు చేయగా, తాజాగా మరో 474 పార్టీలను జాబితా నుంచి తొలగించారు. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే మొత్తం 808 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దయ్యింది. తెలంగాణలో రద్దయిన పార్టీల జాబితాలో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా పార్టీ తో పాటు.. ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ వంటివి ఉన్నాయి. 2006లో జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే 2014 తర్వాత జేపీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, వివిధ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ ఇప్పుడు గుర్తింపు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా త్వరలో మరో 359 పార్టీలను కూడా తొలగించనున్నట్లు ఈసీ సంకేతాలిచ్చింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీలు ఉండనున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రక్షాళన కొనసాగుతుందని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఈసీ రద్దు చేసిన పార్టీల జాబితా: ఆలిండియా ఆజాద్ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి. ఏపీలో ఈసీ రద్దు చేసిన పార్టీల జాబితా: భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com