జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

- September 21, 2025 , by Maagulf
జాతిని ఉద్దేశించి  ప్రధాని మోదీ ప్రసంగం..

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

“అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. జీఎస్టీ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయి. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే, ఈ మార్పులు ఉత్పత్తిదారులు, కస్టమర్లు ఇద్దరూ లాభపడతారు” అని చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా దేశం అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు. విదేశీ వద్దని స్వదేశీ వస్తువులనే వాడదామని పిలుపునిచ్చారు. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ మార్పులు ఉపయోగపడతాయని అన్నారు. జీఎస్టీని తీసుకొచ్చాక ఇప్పటికే అనేక రకాల పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పారు.

“దేశమంతా సంతోషపడేలా ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు వస్తున్నాయి. ఈ సంస్కరణలు దేశ వృద్ధికి ఊతమిస్తాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది. అలాగే, నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది” అని మోదీ తెలిపారు.

“మీరు 2014లో మాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజా, జాతీయ ప్రయోజనాల కోసం జీఎస్టీను ప్రాధాన్యంగా చేసుకున్నాం. ప్రతి స్టేక్‌హోల్డర్‌తో చర్చించాము. ప్రతి రాష్ట్ర సందేహాలను పరిష్కరించాము. ప్రతి ప్రశ్నకు సమాధానాలు తెలిపాము. అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా భారత్‌లో అతిపెద్ద పన్ను సవరణ సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఫలితంగా, దేశం పన్నుల నెట్వర్క్ నుంచి విముక్తమైంది. ఒకే దేశం, ఒకే పన్ను అనే కల నిజమైంది” అని తెలిపారు.

“జీఎస్టీ సంస్కరణలతో 5, 18 శాతం శ్లాబులు ఉండనున్నాయి. అంటే ప్రతి ఎన్నో వస్తువు ధర తగ్గుతుంది. ఆహార పదార్థాలు, ఔషధాలు, సబ్బులు, పేస్ట్, హెల్త్ లైఫ్ ఇన్సురెన్స్‌ వంటి వాటి రేట్లు తగ్గుతాయి” అని మోదీ చెప్పారు.

“నాగరిక్‌ దేవోభవ అనే మంత్రాన్ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తున్నాం. దాన్ని ప్రతిబింబాన్ని ఈ నెక్స్ట్‌ జనరేషన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా మనం చూస్తాం” అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com