జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..

- September 22, 2025 , by Maagulf
జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చకు లోను అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. ఆయన ఈ సంస్కరణలను సాహసోపేతమైనవిగా, దూరదృష్టితో కూడినవిగా అభివర్ణించారు.

‘ఎక్స్’ వేదికగా స్పందించిన సీఎం
చంద్రబాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. “ఈ సాహసోపేత, దూరదృష్టి గల సంస్కరణను తీసుకువచ్చినందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని వ్యాఖ్యానించారు. పండుగల కాలంలో ప్రజలకు ఈ జీఎస్టీ రీపార్మ్స్ డబుల్ ఆనందాన్ని అందించాయని తెలిపారు.

సరళమైన పన్నుల విధానం – ప్రజలకు నేరుగా లాభం
నూతన జీఎస్టీ (GST)విధానంలో పన్ను శ్లాబులను రెండు మాత్రమే (5% మరియు 18%)గా తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని చంద్రబాబు తెలిపారు. దాదాపు 99 శాతం వస్తువులు 5% పన్ను పరిధిలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద, రైతులు, మహిళలు, యువత వంటి వర్గాలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని వివరించారు.

వ్యాపార వృద్ధికి దోహదపడే సంస్కరణలు
ఈ సరళీకృత పన్ను విధానం వల్ల వ్యాపార నిర్వహణలో సమర్థత పెరుగుతుందని, ఖర్చులు తగ్గిపోతాయని, తద్వారా ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా మార్చడంలో ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు.

‘నాగరిక్ దేవో భవ’ స్ఫూర్తి – ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందడుగు
‘నాగరిక్ దేవో భవ’ అనే ప్రధాని నినాదాన్ని ఉదహరిస్తూ, ఈ సంస్కరణలు ప్రతి భారతీయుడి జీవితానికి భద్రతా బహుమతిగా నిలుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ అని” అనే మోదీ పిలుపు దేశవ్యాప్తంగా ఒక నూతన జాతీయ చైతన్యాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

రాష్ట్రాల వృద్ధికి సమాన పాత్ర – సహకార సమాఖ్యకు ఉత్సాహం
ప్రధాని మోదీ కోరినట్లు వికసిత భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాలు సమాన భాగస్వాములుగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇది సహకార సమాఖ్య భావనకు ఊతమిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆయన “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యంతో పాటు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com