ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!

- September 24, 2025 , by Maagulf
ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 (GST 2.0)సంస్కరణలు ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నాయి. పలు రంగాల్లో పన్ను రేట్లు తగ్గడంతో విక్రయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. పన్ను భారాన్ని తగ్గించడం వలన ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. జీఎస్టీ 2.0 వల్ల వచ్చిన ఈ మార్పు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోందని పేర్కొన్నారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం… జీఎస్టీ కొత్త విధానం అమలులోకి వచ్చిన అనంతరం వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్యలు పెరిగాయి. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయి. వీటిలో 2,352 మోటార్ సైకిళ్లు, 241 కార్లు మరియు క్యాబ్‌లు, 60 ట్రాక్టర్లు, 227 ఆటోలు, 47 గూడ్స్ వాహనాలు, 50 ఆటో గూడ్స్ వాహనాలు, 12 ఇతర వాహనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ గణాంకాలు వాహన విక్రయ రంగం ఎంత వేగంగా పుంజుకుంటోందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

అంతేకాక భవిష్యత్తులో రోజుకు 4,000 వాహనాల వరకు రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి తగినట్లుగా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే జీఎస్టీ 2.0 సంస్కరణలకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. ఇకపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జీఎస్టీ 2.0 వల్ల పన్ను భారంతో పాటు వాహన ధరలు కూడా తగ్గడం, మధ్యతరగతి ప్రజలకు వాహనాల కొనుగోలు మరింత సులభతరం కావడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గట్టి బలం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com