ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్

- September 25, 2025 , by Maagulf
ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్

దుబాయ్: ఆసియా కప్‌ 2025 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదిరిపోయే ఫామ్‌లో దూసుకెళ్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ క్రమంగా తన ప్రభావాన్ని చూపిస్తూ, క్రమశిక్షణతో కూడిన ఆటతీరు కనబరుస్తూ, ఒకటంటే ఒకటే అన్నట్టు వరుస విజయాలు అందుకుంటోంది. ఇప్పటికే సూపర్–4 దశలో నాలుగు విజయాలు సాధించిన టీమిండియా, బుధవారం జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి, ఓటమి రుచి చూడకుండా ఫైనల్ బరిలో అడుగుపెట్టింది.

ఈ సూపర్–4 మ్యాచ్‌లో భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు అందరూ అద్భుతంగా రాణించారు. సమష్టి కృషితోనే 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ పై ఆధిపత్యం చెలాయించగలిగారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ల ఇన్నింగ్స్, కీలక సమయాల్లో బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతోనే విజయం సాధ్యమైంది. ఈ విజయం తర్వాత మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన అవసరమే లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్‌కి చేరుకుంది.

మరోవైపు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బంగ్లాదేశ్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్థాన్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే బంగ్లాదేశ్‌కు ఫైనల్ బెర్త్‌ దక్కుతుంది. పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ చేరుతుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.

అనంతరం బంగ్లాదేశ్ 127 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ సైఫ్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీ (Half a century) తో పోరాడినా ఫలితం లేకపోయింది. పర్వేజ్ హోస్సేన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), వరుణ్ చక్రవర్తీ(2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌, తిలక్ వర్మ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు క్యాచ్‌లు సైఫ్ హసన్‌వే కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com