కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు

- October 11, 2025 , by Maagulf
కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించిన వివరాల ప్రకారం, త్వరలో ‘ఏపీఏటీఎస్ (APATS)’ మొబైల్ యాప్ ప్రజల కోసం అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని ఉత్పత్తి తేదీ, నాణ్యత ప్రమాణాలు, గడువు వంటి కీలక సమాచారం తెలుసుకోవచ్చు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, “ఈ యాప్‌ ద్వారా ప్రజలు కల్తీ మద్యం బారిన పడకుండా రక్షించబడతారు. కల్తీని గుర్తించడం ఇక సులభమవుతుంది. ఇది ఆరోగ్య భద్రతకు కొత్త దారిని చూపుతుంది” అన్నారు. ప్రభుత్వ చర్యలతో కల్తీ మద్యం మాఫియాలపై భయం నెలకొంటుంది అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర,మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “వైసీపీ ఓటమి తర్వాత నాని మతిస్థిమితం కోల్పోయి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన సంగతి ఆయన మరిచిపోయారు,” అని రవీంద్ర విమర్శించారు.

అలాగే, రాష్ట్రంలో ఏ మరణం జరిగినా దానిని మద్యానికి ముడిపెట్టి “శవ రాజకీయాలు” చేయడం జగన్ ప్రభుత్వ అలవాటు అని ఆయన ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం వ్యవహారంపై నాలుగు స్వతంత్ర బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని, ఏ పార్టీ నేతలైనా నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలపై సోషల్ మీడియాలో కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com