నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్‌ ఏర్పాటు..

- October 13, 2025 , by Maagulf
నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్‌ ఏర్పాటు..

అమరావతి: ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న ములకలచెరువు నకిలీ మద్యం కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు.

ఇందులో రాహుల్‌ దేవ్‌ శర్మ (ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్), మల్లికా గార్గ్ (ఆర్టీజీఎస్) సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఎక్సైజ్ శాఖ నుంచి ఈ అంశంపై పూర్తి అవగాహన ఉన్న ఒక నిపుణుడిని కూడా బృందంలో చేర్చనున్నారు. నకిలీ మద్యం కేసులో 23 మంది నిందితులని ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ ఇటీవల వెలుగుచూసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు జయచంద్రా రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఈ కేసులో నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు, ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్‌ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ రాకెట్‌ బయటపడే సమయానికి ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు గన్నవరం వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్‌ బృందాలు అక్కడ మాటు వేశాయి. జనార్దన్ రావు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.

ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న జనార్దన్ రావు గత నెల 24న దక్షిణాఫ్రికా వెళ్లారు. ఈ నెల 5నే భారత్ కు తిరిగి రావాలి. ఈలోగా నకిలీ మద్యం దందా వెలుగుచూడటంతో అక్కడే ఆగిపోయారు. కాగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆఫ్రికా నుంచే ఓ వీడియో విడుదల చేశారు జనార్ధన్. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com