దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- October 25, 2025
దుబాయ్: వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదాన్ని అందిపుచ్చుకుని ప్రతీ ప్రవాసాంధ్రుల కుటుంబంలో ఒక్కరు ఏపీలో పెట్టుబడి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.జన్మభూమి-కర్మభూమి సిద్ధాంతాన్ని అందిపుచ్చుకుని రెండుదేశాల అభివృద్ధికీ తోడ్పడాలని సూచించారు.శుక్రవారం దుబాయ్‌లోని లీమెరిడియన్ హోటల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పది గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు పాల్గొన్నారు. యుఏఈ సహా సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ..."తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించాను. 30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించాను. తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారు.గల్ఫ్ లోని పది దేశాల నుంచి తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది.

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్
‘అబుదాబీ, దుబాయ్‌లు ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జ్ ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. ఏపీలోనూ పర్యాటకానికి ప్రోత్సాహం కల్పిస్తున్నాం. దేశంలో ఐటీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహిస్తే ఇప్పుడు ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాం. వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ పేరిట డేటా లేక్ తీసుకువస్తున్నాం. దీని ద్వారానే సుపరిపాలన అందించేలా కార్యాచరణ చేస్తున్నాం. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నాం. గూగుల్ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దేశంలో క్వాంటం వ్యాలీ ఉన్న ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే."అని సీఎం అన్నారు.
ప్రవాసాంధ్రులకు భీమా పథకం
‘ఏపీలో ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి లక్ష్యాన్ని సాధిస్తాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతోంది. త్వరలో ఇక్కడి నుంచే దుబాయ్‌కి అవసరమైన ఎయిర్ టాక్సీలు తయారు చేసే రోజు వస్తుంది. దుబాయ్ లాంటి దేశాలు మన దేశం నుంచే బంగారం కొని, ఆభరణాలుగా చేసి మళ్లీ మనకే విక్రయిస్తున్నారు. ఈ తరహా నాణ్యమైన ఉత్పాదక ప్రక్రియల్ని మన పారిశ్రామిక వేత్తలు చేపట్టాలి. హెల్తీ వెల్తీ, హ్యాపీ ఏపీ విధానంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాను. ప్రవాసాంధ్రుల కోసం భీమా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.రూ.10 లక్షల వరకూ అందరికీ భీమా కల్పించేలా కార్యక్రమం చేపట్టాం. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులు 18-60 ఏళ్ల వరకూ వయస్సు ఉన్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులకు ఈ భీమా వర్తింపచేస్తున్నాం. ప్రవాసాంధ్రులు ఎదుర్కోనే న్యాయపరమైన ఇబ్బందులకు ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజుల లాంటి సమస్యల పరిష్కారం చేస్తాం. అలాగే ప్రసూతీ ఖర్చుల కింద రూ.35 వేలు, సిజేరియన్ ద్వారా రూ.50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తాం. ఏపీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అని ఏపీలో పిలుపునిచ్చాం. ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో ఒకరు పరిశ్రమ పెట్టండి. దీనికోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. దుబాయ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చి ఏ నాయకుడికీ దక్కని గౌరవాన్ని అందించిన ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం తెలుగు డయాస్పోరాకు హాజరైన వారు ఫోటోలు దిగేందుకు సీఎం సమయం ఇచ్చారు.ఈ కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ సౌసైటీ చైర్మన్ వేమూరి రవి, దుబాయ్‌లో భారత కాన్సులేట్ జనరల్ సతీష్ శివన్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాం ప్రసాద్,ఎన్నారై టీడీపీ గల్ఫ్ ప్రెసిడెంట్ రాధా కృష్ణ రావి,ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్లు ముక్కు తులసి కుమార్,రవి కిరణ్,వాసు,ఖాదర్ బాషా,విశ్వేశ్వర రావు తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రాలో అవకాశాలు ఆకర్షిస్తున్నాయి
ఈ క్రమంలో యూఏఈ పారిశ్రామికవేత్తలు కూడా తాము ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగంలో శోభా గ్రూప్ ఆసక్తిని కనబరిచింది.అలాగే అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు రూ.100 కోట్లు విరాళాన్ని శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్ ప్రకటించారు. ఇక ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వామ్యంపై ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ దిగ్గజమైన షరాఫ్ గ్రూప్ కూడా ఏపీలో లాజిస్టిక్స్ పార్క్‌లు, గిడ్డంగులు స్థాపించడానికి సుముఖత వ్యక్తం చేసింది. బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత తెలిపింది..జీ 42 సంస్థ ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం అందుకుంది. ముఖ్యంగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ – దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం కుదిరింది. ఇంధనం రంగంలో మస్దార్ వంటి సంస్థలను సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. అలాగే, ఏపీలో కోకో ఉత్పత్తి బాగున్న నేపథ్యంలో అగ్తియా గ్రూప్‌ను చాక్లెట్ పరిశ్రమ స్థాపించే అంశంపై ఆలోచన చేయాలని కోరారు. వీరంతా ఏపీలో పెట్టుబడులకు ఆసక్తిని కనబరిచారు.వచ్చేనెల విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరవుతామని చెప్పారు. తాము కచ్చితమైన ప్రతిపాదనలతో వచ్చే అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. యంగెస్ట్ స్టేట్...హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే నినాదం బాగుందని పలువురు పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీలు
యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జయూదీ, ఆర్థిక, పర్యాటక శాఖామంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మర్రీలతో జరిగిన కీలక సమావేశంలోనూ వాణిజ్య బంధం పెంపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లాజిస్టిక్స్ వంటి రంగాల్లో సహకారంపై సీఎం బృందం చర్చించింది.ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ – దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం కుదిరింది. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి తమ బృందాన్ని పంపుతామని యూఏఈ ప్రభుత్వ మంత్రులు సీఎంకు చెప్పారు.
దుబాయ్‌లో ఆకట్టుకున్న తెలుగు డయాస్పోరా
మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సన్నాహక సదస్సు రోడ్ షో ఒక ముఖ్య ఘట్టం.ఈ రోడ్ షోలో పాల్గొన్న భారతీయ పారిశ్రామికవేత్తలు, యూఏఈలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతను వివరించడంతో పాటు.. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు ఎంత శ్రద్ధ తీసుకుంటారన్న అంశాన్ని ఆయన వివరించారు. కియా మోటార్స్ సంస్థను పెట్టుబడులు కోరడానికి ముఖ్యమంత్రి నార్త్ కొరియాలో పర్యటించినప్పుడు.. తాను అక్కడే విధులు నిర్వహించానని... రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం పడే తపనను తాను దగ్గరుండి చూశానని సతీష్ కుమార్ శివన్ చెప్పారు. అధికారులు కాకుండా.. స్వయంగా తానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం చంద్రబాబులో ఉన్న ప్రత్యేకత అని చెప్పారు. ఇక పర్యటన చివరి రోజు గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు.
పెట్టుబడుల పై ధీమాతో స్వదేశానికి
సీఎం చంద్రబాబు బృందం మూడు రోజుల పర్యటన సక్సెస్ అయింది.బిజీ బిజీగా అలుపెరగకుండా వరుస భేటీలు నిర్వహించింది.సింగపూర్, ఇటు యూఏఈలతో పాటు...వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలను విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు వచ్చేలా చూడాలని ఈడీబీ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి కనపర్చిన సంస్థలకు చెందిన ప్రతినిధులతో నిరంతరం టచ్ లో ఉండాలని సూచించారు.వచ్చే నెలలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు ఇంకా ఎంతో సమయం లేదని..ఇప్పటి నుంచి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేలా పని చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశించారు.భాగస్వామ్య సదస్సుకు వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈఓలతో పాటు వివిధ దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, నిపుణులు హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు.






తాజా వార్తలు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!







