ఇస్రో బాహుబలి రాకెట్‌ ఘన విజయం

- November 02, 2025 , by Maagulf
ఇస్రో బాహుబలి రాకెట్‌ ఘన విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO CMS-03) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి LVM3-M5 రాకెట్‌ ద్వారా CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా ప్రయోగించింది. సాయంత్రం 5:26 గంటలకు రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి నింగిలోకి ఎగిరిన “బాహుబలి రాకెట్” గర్వకారణంగా నిలిచింది. 4,410 కిలోల బరువున్న CMS-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లో సురక్షితంగా ప్రవేశపెట్టడంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు.

ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా ఇస్రో మరోసారి ప్రపంచానికి తన సాంకేతిక సామర్థ్యాన్ని చూపించింది. 24 గంటల నిరంతర కౌంట్‌డౌన్ తర్వాత ఖచ్చితమైన సమయానికి రాకెట్‌ ప్రయాణం ప్రారంభమైంది.

CMS-03 లేదా GSAT-7R అని పిలువబడే ఈ ఉపగ్రహం పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైంది. ఇది ఇస్రో(ISRO CMS-03) ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి ప్రవేశించిన ఈ ఉపగ్రహం, పది సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది. ఇది ముఖ్యంగా కమ్యూనికేషన్ మరియు సముద్ర వాతావరణ పరిశీలనకు ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత్‌ సముద్ర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మరియు దూర ప్రాంతాలకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించబడుతుంది. గతంలో ఇస్రో ప్రయోగించిన GSAT-7 ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో, దానికి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సాంకేతికతతో CMS-03 (GSAT-7R) రూపొందించబడింది. ఇది భారత్‌ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మరింత బలపరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

CMS-03 విజయవంతమైన ప్రయోగంతో ఇస్రో అంతర్జాతీయ స్థాయిలో మరో మైలురాయిని చేరుకుంది. LVM3 రాకెట్‌ను “బాహుబలి” అని పిలిచే కారణం దాని శక్తివంతమైన బరువును మోయగల సామర్థ్యం. ఈ ప్రయోగం ద్వారా భారత్‌ అధునాతన కమ్యూనికేషన్‌, నావిగేషన్‌, డిఫెన్స్‌ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోనుంది. అంతరిక్ష రంగంలో భారత్‌ స్వయం సమృద్ధికి ఇది మరో పెద్ద అడుగుగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com