అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం

- November 05, 2025 , by Maagulf
అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ‘మూన్‌షాట్’ కార్యక్రమాన్ని ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ పేరుతో చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని గూగుల్ భావిస్తోంది. ఈ ప్రకటన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని అంచనా వేసిన కొద్ది వారాలకే రావడం గమనార్హం.

ఈ ప్రాజెక్టులో భాగంగా, గూగుల్ తన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (టీపీయూ) ను అంతరిక్షంలోకి పంపనుంది. సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఏఐ డేటా సెంటర్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలను ఒకదానికొకటి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్స్ ద్వారా అనుసంధానిస్తారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) మాట్లాడుతూ, “మా టీపీయూలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, అటానమస్ డ్రైవింగ్ లాంటి మా మూన్‌షాట్ ప్రాజెక్టుల స్ఫూర్తితోనే ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ను ప్రారంభించాం. సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని అంతరిక్షంలో ఏఐ వ్యవస్థలను ఎలా నిర్మించవచ్చో అన్వేషిస్తున్నాం” అని తెలిపారు. 2027 ప్రారంభం నాటికి ప్లానెట్ సంస్థ భాగస్వామ్యంతో రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన వివరించారు.

అంతరిక్షంలో ఎందుకు?

  • ఏఐ అల్గారిథమ్‌లకు అపారమైన విద్యుత్ శక్తి అవసరం. భూమిపై ఈ విద్యుత్ అవసరాలు పర్యావరణంపై భారం మోపుతున్నందున గూగుల్ అంతరిక్షాన్ని పరిష్కారంగా ఎంచుకుంది.
  • ఎక్కువ సామర్థ్యం: భూమి మీద కంటే అంతరిక్షంలోని సరైన కక్ష్యలో ఉండే సోలార్ ప్యానెల్ 8 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది.
  • నిరంతరాయ విద్యుత్: అంతరిక్షంలో దాదాపు నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు, దీంతో బ్యాటరీల అవసరం తగ్గుతుంది.
  • లక్ష్యం: భూమిపై వనరుల వినియోగాన్ని తగ్గించి, ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే అంతరిక్షమే సరైన ప్రదేశమని గూగుల్ పేర్కొంది.
  • రేడియేషన్, థర్మల్ మేనేజ్‌మెంట్ వంటి సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ, తమ ట్రిలియం-జనరేషన్ టీపీయూలు భూమికి సమీప కక్ష్యలోని రేడియేషన్‌ను తట్టుకోగలవని గూగుల్ తెలిపింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com