ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

- November 10, 2025 , by Maagulf
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగం మరోసారి చైతన్యం సంతరించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ పెట్టుబడిదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్ మరియు రహేజా సంస్థ పరిశ్రమ స్థాపనకు ఆమోదం లభించింది. ఇది విశాఖలో ఐటీ రంగం విస్తరణకు కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఐటీ, సర్వీస్ సెక్టార్‌లో కొత్త అవకాశాలు సృష్టించడమే కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఇది పెద్ద అడుగుగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదే తరహాలో రాష్ట్రం అంతటా వివిధ జిల్లాల్లో కొత్త పరిశ్రమలకు భూములు కేటాయించబడినాయి. ఓర్వకల్లులో 50 ఎకరాల్లో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్, సిగాచీ కంపెనీకి 100 ఎకరాల్లో సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్, అలాగే అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా కంపెనీకి 150 ఎకరాలు కేటాయించబడినట్లు సమాచారం. అనంతపురంలో 300 ఎకరాల్లో TMT బార్ ప్లాంట్ స్థాపనకు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ వేగవంతమై, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డ్రోన్ ఇండస్ట్రీ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు రావడం రాష్ట్ర పరిశ్రమల ప్రగతికి కొత్త దిశను చూపిస్తోంది.

అదే విధంగా, నెల్లూరులో బిర్లా గ్రూప్ ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమి కేటాయింపు పూర్తయింది. ఇక కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పరిశ్రమలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, రవాణా, హౌసింగ్ రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాజెక్టులు అమలు దశలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటములో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. పరిశ్రమల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com