ఏపీలో మూడు కొత్త జిల్లాలు

- November 25, 2025 , by Maagulf
ఏపీలో మూడు కొత్త జిల్లాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో, ప్రజల సౌకర్యం, భౌగోళిక సౌలభ్యం మరియు పరిపాలనా సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ మూడు కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లె, మరియు రంపచోడవరం. ఈ జిల్లాల ఏర్పాటుపై తుది మార్గదర్శకాలను ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో, ఉపసంఘం సమర్పించిన నివేదికలో కొన్ని సవరణలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మార్పులన్నీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సుదూర ప్రయాణ భారాన్ని తగ్గించడం. ఉదాహరణకు, మార్కాపురం జిల్లా ఏర్పాటుతో కనిగిరి, గిద్దలూరు, దర్శి ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ప్రస్తుతం చేస్తున్న 200 కి.మీ. ప్రయాణం తగ్గుతుంది. అలాగే, మదనపల్లె జిల్లాలో అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి మదనపల్లె, పిల్లేరు, పుంగనూరు, తంబలపల్లె మండలాలను కలుపుతారు. రంపచోడవరం జిల్లా ఏర్పాటు ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల ప్రజలకు 215 కి.మీ. దూర ప్రయాణం సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు.కొత్త జిల్లాలతో పాటు, అడ్డంకి, మదకశీర, గిద్దలూరు, పిల్లేరు ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది.

ఈ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా, కొన్ని జిల్లాల సరిహద్దులను మార్చడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అద్దంకి, కందుకూరు ప్రాంతాలను ప్రకాశం జిల్లాలో కలుపుతారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో సరిహద్దు మార్పులకు సూచనలు ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ల మార్పుల్లో భాగంగా, గూడూరు డివిజన్‌ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు, నగరి రెవెన్యూ డివిజన్‌ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాలోకి మార్చేందుకు ఆమోదం తెలిపారు. అయితే, బనగనపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మార్పులన్నిటితో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com