కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

- December 01, 2025 , by Maagulf
కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

న్యూ ఢిల్లీ: భారత దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్ దొంగతనాలు, డిజిటల్ మోసాలు ప్రజలను తీవ్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటికి, అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఇక పై దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథీ’ అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది.

ముఖ్యంగా, ఈ యాప్‌ ను వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించడం (డిలీట్ చేయడం) సాధ్యం కాదు. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది. సైబర్ మోసాలు, ఫోన్ చోరీలు, ఐఎంఈఐ (IMEI) నంబర్ల ట్యాంపరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ ఏడాది జనవరిలో ‘సంచార్ సాథీ’ పోర్టల్‌ను, యాప్‌ను ప్రారంభించింది.

దీని ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సహాయంతో సుమారు 7 లక్షల చోరీ ఫోన్‌లను గుర్తించి బ్లాక్ చేశారు. ఈ యాప్ సైబర్ దాడుల నుంచి వినియోగదారులను హెచ్చరించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను కూడా నిరోధిస్తుంది.కొత్త ఆదేశాల ప్రకారం, 2025 డిసెంబర్ 1 నుంచి తయారయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాల్సి ఉంటుంది.

ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా దీన్ని ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. ఈ మార్పులను అమలు చేయడానికి మొబైల్ కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో థర్డ్-పార్టీ యాప్‌లను డిఫాల్ట్‌గా చేర్చడానికి ఇష్టపడవు. గతంలో ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా సైబర్ నేరాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com