మొదటి సౌదీ సముద్ర రిజర్వ్‌గా ఫరాసన్ దీవులు..!!

- December 02, 2025 , by Maagulf
మొదటి సౌదీ సముద్ర రిజర్వ్‌గా ఫరాసన్ దీవులు..!!

రియాద్: నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NCW) ఫరాసన్ దీవుల రిజర్వ్‌ను రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్‌ల్యాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ (రామ్సర్)లో చేర్చినట్లు ప్రకటించింది. ఇది కన్వెన్షన్ కింద అధికారికంగా నమోదు చేసిన  మొదటి సౌదీ సముద్ర రిజర్వ్‌గా నిలిచింది. సౌదీ విజన్ 2030 మరియు సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ వ్యవస్థలను రక్షించే చర్యలు చేపట్టారు. సౌదీ అరేబియా జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, అత్యంత సున్నితమైన పర్యావరణ ఆవాసాలను పునరుద్ధరించడం మరియు తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను కాపాడటానికి ప్రపంచ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో భాగంగా, 2024లో రామ్సర్ కన్వెన్షన్‌లో సౌదీ అరేబియా చేరిందని నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ CEO డాక్టర్ మొహమ్మద్ ఖుర్బాన్ తెలిపారు.

అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా చిత్తడి నేలల రక్షణ మరియు వలస నీటి పక్షుల సంరక్షణలో పురోగతి సాధించామని అన్నారు.  

ఫరాసన్ దీవుల రిజర్వ్ ఎర్ర సముద్రంలోని అత్యంత ముఖ్యమైన సహజ ప్రదేశాలలో ఒకటి.  పగడపు దిబ్బలు, మడ అడవులు మరియు నదీముఖద్వారాలు వంటి విభిన్న పర్యావరణ వ్యవస్థలకు ఇది నిలయంగా ఉంది. ఇది అరుదైన మరియు అంతరించిపోతున్న ఎన్నో జాతులకు నివాసంగా కూడా ఉందని పేర్కొన్నారు.

జాజాన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ఎర్ర సముద్రంలో ఉన్న ఫరాసన్ ద్వీపసమూహం.. సౌదీలోని మొత్తం 1,285 ద్వీపాలలో 15.6 శాతానికి సమానం. ఈ ద్వీపసమూహం మొత్తం 600 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది.  84 పగడపు దీవులను కలిగి ఉంది. తెల్లని ఇసుక బీచ్‌లు మరియు నీలం రంగు జలాలకు ప్రసిద్ధి చెందిన ఇది, భూసంబంధమైన మరియు సముద్ర జీవులకు వైవిధ్యమైన సహజ ఆవాసంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com