గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్

- December 08, 2025 , by Maagulf
గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్

హైదరాబాద్: హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ సీఎం . రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ముందు నగర బ్రాండింగ్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక రహదారులకు అంతర్జాతీయ ప్రాచుర్యం ఉన్న పేర్లు పెట్టే ఆలోచనను వెల్లడించారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలోని ముఖ్యమైన రహదారిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదనను సీఎం ముందుకు తెచ్చారు. ఇది అమలైతే, అమెరికా వెలుపల ఒక ప్రస్తుత లేదా మాజీ యూఎస్ అధ్యక్షుడి పేరుతో రహదారి పేరు పెట్టిన తొలి ఉదాహరణగా నిలవనుంది.

ఈ నామకరణం అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదగడాన్ని ప్రతిబింబిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి ప్రముఖ టెక్ కంపెనీల పేర్లతో రోడ్లు, జంక్షన్లకు పేర్లు పెట్టే యోచన కూడా ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌కు (Google Street Hyderabad) పద్మభూషణ్ రతన్ టాటా పేరును పెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న రవిర్యాల ఇంటర్‌చేంజ్‌ను ‘టాటా ఇంటర్‌చేంజ్’గా నామకరణం చేశారు.

ఈ నిర్ణయం ప్రశంసలతో పాటు రాజకీయ విమర్శలకు కూడా గురైంది. బీజేపీ నేతలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ, ట్రెండ్స్‌ను కాకుండా చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, పేర్ల మార్పు అవసరమైతే హైదరాబాద్‌ను మళ్లీ ‘భాగ్యనగర్’గా మార్చాలని సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com