న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

- December 15, 2025 , by Maagulf
న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు

హైదరాబాద్: కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో నగరంలో పబ్స్, హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్‌లు సందడిగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ మేరకు కీలక ఆదేశాలు విడుదల చేశారు. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలన్నా, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 31న పబ్స్, బార్లు, హోటల్స్, క్లబ్‌లు, రెస్టారెంట్లలో వేడుకలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే నిర్వహించాలి. మైనర్లకు ఈవెంట్లలో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. ప్రతి ఈవెంట్ ప్రాంగణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. అశ్లీల కార్యక్రమాలు నిర్వహించరాదు. ఈవెంట్ నిర్వాహకులు కనీసం 15 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలి.

రోడ్ల పై బహిరంగంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై నిషేధం విధించారు. ఇండోర్ హాల్స్‌లో మాత్రమే రాత్రి 1 గంట వరకు సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత శబ్దం 45 డెసిబెల్స్‌ను మించకూడదు. ఈవెంట్లలో ఆయుధాలు, మత్తు పదార్థాలకు అనుమతి లేదు. వేదిక సామర్థ్యాన్ని మించి టికెట్లు జారీ చేయరాదు. మద్యం సేవించిన వారికి డ్రైవర్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com